Religion politics:
మొన్న బడ్జెట్ మధ్య తరగతికి ఏమిచ్చింది?.
ఏమీ ఇవ్వలేదని మేధావులంతా పెదవి విరిచారు.
ఛానెళ్లలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి.
పత్రికల్లో పేజీలకు పేజీలు రాసారు.
యుపిలో ఎన్నికల ముందు ఇలాంటి బడ్జెటా అని ఆశ్చర్యపోయారు.
ఎవరో ఒక పెద్దాయన ఒక్క మాటలో తేల్చేసాడు.
ఏమీ ఇవ్వక్కర్లేదు.
ఈ దేశంలో మధ్యతరగతికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, చిరుద్యోగులకు
బడ్జెట్ లలో ఏమీ ఇవ్వకపోయినా..
ఆర్ధికంగా వాళ్లకి ఏ మేలూ చేయకపోయినా…
వాళ్ళ వోట్లు ఎలా రాబట్టుకోవాలో మోడీకి బాగా తెలుసు.
వాళ్లు అడిగేవన్నీ ఇవ్వలేరు కాబట్టీ,
అడగనిదొక్కటీ ఎప్పటికప్పుడు సప్లయి చేస్తూ వుండాలి.
జనంలో ఆ డోస్ తగ్గకుండా చూడాలి.
పన్నులు పెరగొచ్చు.
ధరలు పైపైకి పోవచ్చు..
ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు.,
వ్యాపారం, వ్యవసాయం ఏమైనా కావచ్చు..
ఇలాంటి చిన్నా చితకా విషయాలు పట్టించుకోనంత పెద్ద ఎజెండాని జనానికి ఎలా ఇవ్వాలో
అధికార పార్టీకి బాగా తెలుసు.
ఎనిమిదేళ్ళుగా చాలా చూసాం..
ఆవుమాంసాలు,
పౌరచట్టాలు,
లవ్ జిహాదీలు..
ఆ చిట్టా అంతా తెలిసిందే కనుక
తాజా ఉదాహరణలు మూడు చూద్దాం.
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన ఈ మూడు ఘటనలు..
మన ఆలోచనలు ఎంతగా మారిపోయాయో..
మన ప్రాధాన్యాలు ఎంతగా హైజాక్ అయ్యాయో, మన మెదళ్ళు ఎంత రిమోట్ కంట్రోల్ లోకి
వెళ్ళిపోయాయో చెప్పడానికి ఈ మూడూ సాక్ష్యాలు..
ముందుగా మహరాష్ట్ర చూద్దాం.
షారూఖ్ ఖాన్ మీద జరిగిన ట్రోలింగ్ చూశారా?
దివంగత లతామంగేష్కర్ కి నివాళి ఘటించడంలో కూడా మతవిద్వేషాలను గమనించారా?
షారూఖ్ ఖాన్ ఉమ్మేసాడనేవాళ్ళు కొందరు..
చనిపోయిన వ్యక్తి మతంలోనే నివాళి వుండాలని శాసించేవాళ్ళు ఇంకొందరు.
సర్వమతప్రార్థనలు ఆనవాయితీగా జరిగే దేశమేనా ఇది అనిపిస్తుంది.
ప్రేమ, బాధ, దుఃఖం.. ఇలాంటి భావోద్వేగాలన్నీ పోయి..
మతం, ద్వేషం మాత్రమే మిగిలిపోతున్నాయా అనిపిస్తుంది.
రెండోది తమిళనాడులో సంఘటన.
ఆరియాలూర్ జిల్లా మైఖేల్ పట్టికుగ్రామం.
వందేళ్లనుంచి అక్కడొక మిషనరీ స్కూల్ నడుస్తోంది.
ఆ స్కూల్ విద్యార్థుల్లో ఎనభైశాతం మంది విద్యార్థులు హిందువులే.
అక్కడొక ఒక విద్యార్థిని అత్మహత్య చేసుకుంది.
పోలీసుల ముందు, న్యాయమూర్తి ముందూ ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా
తనని మతమార్పిడి కోసం వత్తిడి చేస్తున్నట్టు చెప్పలేదు.
తనచేత హాస్టల్లో చాకిరీ చేయిస్తున్నారని మాత్రమే ఆమె చెప్పింది.
చనిపోయిన విద్యార్థికి ఇంట్లో పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా లేవు
ఆమె తల్లి కొన్నాళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకుంది.
ఆ తర్వాత తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు.
సవితి తల్లివేధింపుల వల్ల సెలవుల్లో కూడా ఆ అమ్మాయి స్కూల్లోనే వుండేదట.
కారణాలేవైనా కావచ్చు.
ఎంతోభవిష్యత్తున్న ఒక విద్యార్థిని ప్రాణాలు పోవడం దారుణమే.
ఇందులో హాస్టల్ వార్డెన్ తప్పుండొచ్చు.
యాజమాన్యం నిర్లక్ష్యం వుండొచ్చు..
దాని మీద విచారణ జరగాలి. దోషులను శిక్షించాల్సిందే.
ఆ పని పోలీసులు, కోర్టు చేయాలి.
కానీ, ఇక్కడ విచారణ అంతా విహెచ్ పి, బిజెపి ఆధ్వర్యంలో జరుగుతోంది.
ఆత్మహత్యయత్నం విషయం తెలుసుకుని స్థానిక విహెచ్ పి నాయకుడు సీన్ లోకి
వచ్చాడు. ఆ అమ్మాయితో ఒక వీడియో షూట్ చేసాడు.
మతమార్పిడికి ఒప్పుకోకపోవడం వల్లే నిన్ను వేధించారా అని ఆ వీడియోలో అడిగాడు.
కావచ్చని ఆ అమ్మాయి చెప్పింది. ఆ ఒక్కమాట పట్టుకుని వందేళ్లు నడిచిన స్కూల్ ని
మూసేయాలని స్థానిక బిజెపి నేతలు నెలరోజులుగా అక్కడ యుద్ధమే చేస్తున్నారు.
ఇప్పుడది ఆ అమ్మాయి ఆత్మహత్య సమస్య కాదు.
స్కూల్లో మతమార్పిడి సమస్య.
మిషనరీ స్కూళ్లను మూయించే సమస్య.
ఊళ్లో రెండు మతాల ఘర్షణ సమస్య.
ఇక మూడోది ఇప్పుడు రగులుతున్నది..
కర్ణాటకలోని హిజబ్ వివాదం.
అడ్మిషన్ అప్పుడు అనుమతించిన హిజబ్ ను, పరీక్షలకు రెండునెలల ముందు మాత్రం
నిషేధించారని విద్యార్థులు చెప్తున్నారు..
నిజానికి మతాచారాలను విద్యాసంస్థల్లో నిషేధించాలనే నిబంధనేమీ లేదు.
చాలా విద్యాసంస్థల్లో సిక్కు విద్యార్థులను తలపాగాలతో అనుమతిస్తారు.
రాజ్యాంగం ప్రకారం మతాచారాలపై మూడు సందర్భాల్లో మాత్రమే నిషేధించొచ్చు.
పబ్లిక్ ఆర్డర్,(శాంతి భద్రతలకు విఘాతం కలిగినిప్పుడు) మొరాలిటీ(నైతిక విలువలకు
భంగం అనుకున్నప్పడు) హెల్త్(ఆరోగ్యపరంగా హాని కలిగిస్తుందనుకున్నప్పుడు)మాత్రమే
మతాచారాలపై ఆంక్షలు పెట్టొచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 చెప్తోంది.
హిజబ్ వల్ల ఈ మూడింటికి ఏ నష్టం లేదు కాబట్టీ దాన్ని అడ్డుకోవడం అంటే,
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఉల్లంఘించడమే అని ఒక వాదన.
ఈ వాదనలన్నీ కాసేపు కోర్టులకు వదిలేద్దాం.
నిజానికి ఇది ముస్లిమ్ విద్యార్ధులకి , విద్యాసంస్థల యాజమాన్యాలకీ సంబంధించిన సమస్య.
వాళ్ళిద్దరూ చర్చలతోనో, కోర్టు కేసులతోనో తేల్చుకోవాల్సిన విషయం.
కానీ, ఇందులో హిందుసంస్థల విద్యార్థులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు.
వాళ్ళని హిజబ్ లతో అనుమతిస్తే, మమ్మల్ని మరో రకం దుస్తులతో అనుమతించాలనే పోటీ
ఏంటి.?
చివరికి హిజబ్ పెట్టుకున్న అమ్మాయిలను బలవంతంగా అడ్డుకోవడం ఏంటి.
రాహూల్ గాంధీకి, బిజెపికి ఈ విషయంలో పనేంటి?
జాతీయజెండా బదులు మతజెండాలు ఎగరేయడం ఏంటి?
కర్ణాటక మొత్తం ఇదొక హిందు-ముస్లిమ్ ఘర్షణగా మారడం ఏంటి?
ఇదిలా జరగాలని పార్టీలేవీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
నేతలెవరూ రంగంలోకి దిగక్కర్లేదు.
ఏడేళ్ళుగా జనం మెదళ్లకు జరిగిన ప్రోగ్రామింగ్ అది.
ప్రతి ఘటనలో మతాన్ని పోల్చుకోగలిగే మైండ్ ట్రెయినింగ్ అది.
పరమతమైతే చాలు వేయికళ్ళతో నిఘా పెట్టడం ఇప్పుడొక దినచర్య.
ఏదో ఒకటి వంక పెట్టి వేధించడం నిత్యకృత్యం.
అన్నీ మతాల ప్రజలూ ఇంత బిజీగా వుండగా ..
ఇంక బడ్జెట్లు, అందులో కేటాయింపులతో జనాలకు పనేంటి?
-శివప్రసాద్
Also Read :