ఆఫ్ఘనిస్తాన్ లో పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతర్జాతీయ సహాయం అందకపోవటంతో తాలిబాన్ పాలకులు ప్రజల ఆకలి కేకలు తీర్చలేకపోతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పౌష్టికాహారం అందక చిన్న పిల్లలు మృత్యువాతపడుతున్నారు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువయ్యాయి. తాజాగా పంజషీర్ ప్రావిన్స్లో ప్రజలు తాలిబన్ సైన్యంపై తిరగబడ్డారు. పరందే లోయలో జరిగిన ఈ ఘటనలో స్థానికులు తాలిబాన్ సైనికులతో యుద్ధానికి దిగినంత పనిచేశారు. నిత్యావసర సరుకులు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. తాలిబాన్ సైనికులు సర్ది చెప్పటంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
అత్యవసర మందుల కొరతతో ఆస్పత్రుల్లో భయానక వాతావరణం నెలకొంది. వివిధ వ్యాధుల నుంచి రక్షణ కోసం చిన్న పిల్లలకు ఇచ్చే టీకాలు అందుబాటులో లేవు. కాబూల్ అస్స్పత్రులు మినహా మిగతా ప్రాంతాల్లో ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం మైనారిటీల రక్షణ, మహిళల హక్కులు, బాలిక విద్య మీద ఆంక్షలు ఎత్తివేసి మానవ హక్కులు పరిరక్షిస్తే గుర్తిస్తామని ప్రపంచ దేశాలు స్పష్టం చేశాయి. ప్రజల ఇక్కట్లను పట్టించుకోని తాలిబన్లు గతంలో మాదిరిగానే మత ఆధారిత చాందస పాలనకే మొగ్గు చూపుతున్నారు. కొద్ది రోజుల క్రితం విద్య సంస్థలు ప్రారంభించినా మహిళల విద్యపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రపంచ దేశాలు ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వ గుర్తింపు అంశంలో ఎటూ తేల్చటం లేదు. తాలిబాన్ల సంకుచిత ధోరణితో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : బలోచిస్తాన్ మిలిటెంట్లతో పాకిస్తాన్ కు తిప్పలే