విశాఖపట్నం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సి.ఆర్.డి.ఏకు సంబంధించిన కేసులకు, రాజధాని తరలింపుకు సంబంధం లేదని విజయసాయి తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలనను కొనసాగించవచ్చని చెప్పారు.
విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితి, విశాఖపట్నం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జీవీఎంసీ పరిధిలోని ప్రతీ వార్డులో పారిశుద్ధ్యం, పార్కుల ఆధునికీకరణ, తాగునీరు పంపిణీ, మురుగునీటి శుద్ది తదితర అంశాలపై అధికారులతో సమీక్షించానన్నారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డుల్లోనూ ”వార్డు డెవలప్మెంట్ ప్రణాళిక”ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని చెప్పారు.
గతంలో విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి వి.ఎం.ఆర్.డి.ఎ పరిధిలో చేసిన శంకుస్థాపనలను త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయి అధికారులను కోరారు. విశాఖ నగరానికి భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ కైలాసగిరి నుండి భోగాపురం వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు వి.ఎం.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో జరగాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.