Big Relief: ఈ నెలాఖరు లోపు సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ జీవో విడుదల కానుందని మెగా స్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సిఎం జగన్ ఆశించిన మేరకు ఓ వైపు ప్రజలకు వినోదం తక్కువ ధరకే అందేలా… మరోవైపు సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించేలా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి చెప్పారు. చిన్న సినిమాలు విజయవంతంగా ఆడాలని, చిన్న నిర్మాతలు కూడా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఐదవ షో కు సిఎం ఆమోదం తెలియజేశారన్నారు. సిఎం తో భేటీ అనంతరం చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి విలేకరులతో మాట్లాడారు.
తెలుగు సినిమాల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారని, పాన్ ఇంటర్నేషనల్ సినిమాలుగా కీర్తి లభిస్తోందని, ఇలాన్న్తి పెద్ద సినిమాల విషయంలో ప్రత్యేకించి ఏమి చేయాలనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సిఎం జగన్, ముందు నుంచీ ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్న మంత్రి పేర్ని నాని లకు చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందో అలాగే ఏపీలో కూడా సినీరంగ అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని సిఎం చెప్పారన్నారు. అందమైన సిటీ వైజాగ్ ను షూటింగ్ లకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని చెప్పారని చిరంజీవి వివరించారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా న్యాయ బద్ధంగా నివేదిక ఇచ్చారని ప్రశంసించారు.
సినిమా రంగానికి ఈరోజు చాలా పెద్ద రిలీఫ్ అని, ఈ చర్చల కోసం చొరవ చూపిన చిరంజీవికి మహేష్ బాబుA కృతజ్ఞతలు తెలిపారు. సిఎంతో చర్చలు సంతృప్తి కరంగా జరిగాయని, తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.
పెద్ద సినిమా, చిన్న సినిమా, నిర్మాతల కష్టాల గురించి ఆయనకున్న సిఎం కున్న అవగాహన ఎంతో ఆకట్టుకుందన్నారు రాజమౌళి. ఆరేడు నెలలుగా సందిగ్ధంలో ఉన్న పరిశ్రమకు ఊరట కలిగిందని, సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన చిరంజీవి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏడెనిమిది నెలలుగా అయోమయంలో ఉన్న తమ పరిశ్రమకు ఈ రోజు గొప్ప రిలీఫ్ లభించిందని ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: ఎండ్ కాదు… శుభం కార్డు పడుతుంది: చిరు