Uttarpradesh First Phase Elections :
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం మంచు కారణంగా కొద్దిసేపు ఓటింగ్ మందకొడిగా సాగినా ఆ తర్వాత మహిళా ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీని సమర్థించామని కొందరు చెప్పగా మతం కన్నా రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని పురుష ఓటర్లు అన్నారు. తొలిదశలో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. మొత్తం 2.27 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈ రోజు సాయంత్రం మూడు గంటల వరకు పోలింగ్ 35.03 శాతంగా నమోదైంది.
తొలిదశలో యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాగా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ ముగిసే సమయానికి 60.17 శాతం చేరుకుంది. సుమారు 60 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా షామ్లి జిల్లాలో 69.42 శాతం నమోదైంది. ముజఫర్‌నగర్ జిల్లాలో 65.34, మధుర 63.28, గౌతమ్‌బుద్ధ్ నగర్ 56.73, ఘజియాబాద్ 54.77, మీరట్ 60.91, ఆగ్రా 60.33 గా నమోదైంది. బాగ్‌పట్ 61.35, హాపూర్ 60.50, బులంద్ షహర్ 60.52, అలీఘడ్ 60.49 జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 11 జిల్లాల్లోనూ 50 వేలమంది పారా మిలిటరీ సిబ్బందిని మొహరించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, బీఎస్పీ మధ్యే ఉండనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 58 స్థానాల్లో 53 స్థానాల్ని అధికార పార్టీ బీజేపీ కైవసం చేసుకుంది. తొలిదశ పోలింగ్‌లో 2.28 కోట్లమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా 623 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, 26 వేల 27 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణకై ప్రతి జిల్లాలోనూ 50 శాతం సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
తొలిదశలో తమదే విజయమని ఎవరికీ వారు చెపుతున్నా యువ మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం బిజెపి వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మహిళలు, పురుషులలో మధ్య వయస్కులు ఎక్కువగా ఆర్.ఎల్.డి – ఎస్.పి. కూటమి వైపు ఆసక్తితో ఉన్నట్టు కనిపించింది. పశ్చిమ యుపిలో జాట్ లు – ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం వారే ఎక్కువగా పాల్గొన్నారు. దీంతో బిజెపి మునుపటి కన్నా తక్కువ సీట్లు వస్తాయనటంలో సందేహం లేదు. ఇక బిఎస్పి ఆలస్యంగా ప్రచారం ప్రారంభించటం కొంత మైనస్ అయినా మాయావతికి పట్టున్న ఆగ్రా ప్రాంతంలో ఏనుగు గుర్తుకే ఓటర్లు పట్టం కట్టే ఛాన్స్ ఉంది.