Saturday, November 23, 2024
HomeTrending Newsకరెంటు లేని గిరిజన గూడెం ఉండొద్దు - మంత్రి సత్యవతి

కరెంటు లేని గిరిజన గూడెం ఉండొద్దు – మంత్రి సత్యవతి

3 Phase Electrification For Tribal Villages : 

గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పించడంలో మనం దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ఆవాసాలన్నింటికి 3 ఫేజ్ విద్యుత్ కచ్చితంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్ కోరిక అని, దీనిని సంపూర్ణంగా చేయాల్సిందేనని చెప్పారు. 2022 సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రంలో కరెంటు లేని గిరిజన ఆవాసం ఉండొద్దని, 3ఫేజ్ విద్యుత్ లేని వ్యవసాయ క్షేత్రంగానీ, పరిశ్రమలుగానీ ఉండొద్దని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాసాలన్నింటికి విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పన, గిరివికాసం అమలుపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు మాసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో అటవీశాఖ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన ఆవాసాలు, 3 ఫేజ్ విద్యుత్ కల్పించడంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి 3467 ఆవాసాలను గుర్తించామని, వీటి విద్యుదీకరణ కోసం గత రెండు బడ్జెట్ లలో 221.01 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 2795 గ్రామాలకు(81శాతం) 3 ఫేజ్ విద్యుదీకరణ పూర్తయిందని, మిగిలిన 19 శాతం ఆవాసాలకు విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యుదీకరణ ఆలస్యం కావడానికి అటవీ శాఖ అనుమతులు, కొన్ని చోట్ల ఆవాసాలు దూరంగా ఉండడం వంటి సమస్యలు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుదీకరణ జరగని గిరిజన ఆవాసాలకు వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలని, ఇందుకోసం అటవీ శాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో కాన్ఫరెన్సు నిర్వహించి, సమస్యలు లేకుండా సమన్వయం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ఆవాసాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ ఉన్న చోట 3 ఫేజ్ విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. సంప్రదాయ విద్యుత్ అవకాశం కల్పించలేని చోట ప్రత్యామ్నయ విద్యుత్ విధానాలను అమలు చేయాలని, ఇందుకోసం తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్(TSREDC) లిమిటెడ్ సంస్థ సహకారాన్ని తీసుకోవాలన్నారు. సంప్రదాయ విద్యుత్ కల్పించడంలో విద్యుత్ శాఖకు ఉన్న ఇబ్బందులను తొలగించే సమన్వయ బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ తీసుకుంటుందని, ఇందుకోసం త్వరలోనే సమావేశం నిర్వహించి, వంద శాతం గిరిజన ఆవాసాలకు విద్యుదీకరణ, 3ఫేజ్ విద్యుత్ పూర్తికావాలన్నారు. ఏ ఒక్క గిరిజన ఆవాసం విద్యుత్ లేకుండా ఉండొద్దని, గిరిజన వ్యవసాయ క్షేత్రం, పరిశ్రమకు 3 ఫేజ్ విద్యుత్ లేకుండా ఉండొద్దన్నారు.

గత రెండేళ్లుగా 3 ఫేజ్ విద్యుదీకరణ జరిగిన గిరిజన ఆవాసాల్లో సిఎం గిరివికాసం పథకం కింద 34,838 గిరిజనులకు 69675 ఎకరాలలో లబ్ది చేకూరిందన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషన్ శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, అటవీ శాఖ పీసీసీఎఫ్(ఎస్.ఎఫ్) ఆర్.ఎం దోబీరియల్, టిఎస్ఎన్పిడిసిఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, టిఎస్ఎస్పీడిసిఎల్ డైరెక్టర్(కమర్షియల్) కె. రాములు, టిఎస్ఆర్ఈడిసిఓ జనరల్ మేనేజర్ బిపిఎస్ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు వి. సముజ్వల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్