ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు పెట్రోలింగ్ పార్టీ పై మెరుపుదాడి చేయడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ మరణించగా, ఒక జవాన్ గాయపడ్డాడు. మృతి చెందిన అధికారిని జార్ఖండ్ రాష్ట్ర నివాసి శాంతి భూషణ్ టిర్కీగా గుర్తించారు. గాయపడిన జవాన్ అప్పారావు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 168వ బెటాలియన్‌కు చెందిన “ఎఫ్” కంపెనీకి చెందిన CRPF బృందం శనివారం ఉదయం రోడ్డు ఓపెనింగ్ డ్యూటీకి బయలుదేరింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బసగూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కెల్ గ్రామానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న దొంగచింత నుల్లా సమీపంలో మావోయిస్టులు రోడ్డు ఓపెనింగ్ నిర్వహిస్తున్న పార్టీపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు.
జవాన్లు వెంటనే తేరుకొని పొజిషన్‌ను తీసుకొని ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. అయితే మొదటి పేలుడులో టిర్కీ కు గాయాలు తగిలి మృతి చెందారని పోలీసు వర్గాలు తెలిపాయి. CRPF జవాన్ల నుండి గట్టిగా మావోయిస్టులకు ఎదురు జవాబు ఇవ్వడంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి వెళ్ళి పోయారు. తప్పించుకొన్న మావోయిస్టులు కోసం అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.