Ukraine Russia Border Issue :
రష్యాతో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఉక్రెయిన్ సిద్దమైంది. రాబోయే 48 గంటల్లో రష్యా సమ్మతిస్తే రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించేందుకు తాము సిద్దమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమ్యత్రో కులేబా ప్రకటించారు. వియన్నా ఒప్పందం ప్రకారం సరిహద్దు వివాదం పరిష్కారం కోసం సిద్దమని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపనే తమ లక్ష్యమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. రష్యా కు అధికారికంగా సమాచారం పంపినట్టు ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే రష్యా సంప్రదింపులకు సమ్మతించకపోతే ఈ వివాదానికి సంబంధించి ఇతర భాగస్వామ్య పక్షాలతో 48 గంటల తర్వాత చర్చలు జరుపుతామని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా భారీ సంఖ్యలో మోహరించిన సైన్యంతో రెండు దేశాల సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొందని, దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కరించుకోవాలని రష్యా కోరుకుంటే ముందుగా సైనిక బలగాల తరలింపు, విన్యాసాలు ఆపి చర్చలకు రావాలని ఉక్రెయిన్ కోరుతోంది.
గత కొద్ది నెలలుగా రష్యా దఫా దఫాలుగా ఉక్రెయిన్ సరిహద్దులకు సైన్యం తరలిస్తోంది. దీనిపై అమెరికా, జర్మనీ తదితర దేశాలు వివరణ కోరితే యుద్ధం, దాడులు తమ ఉద్దేశ్యమే కాదని మాస్కో వర్గాలు అంటున్నాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో బలగాలు రావటం వల్లే యుద్ధ వాతావరణం నెలకొందని, ప్రతిగా తమ సైన్యాన్ని మోహరించాల్సి వచ్చిందని మాస్కో అంటోంది. దాడులు చేయాలనదే తమ ఉద్దేశ్యమే కాదని మరోసారి తేటతెల్లం చేసింది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధించేందుకే అమెరికా అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారం తీవ్రం చేసి, దాడులకు పురికోల్పుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ఏ దేశం మీద దాడులు చేయాలన్నా ముందుగా ఆయా దేశాలపై అభూత కల్పనలు ప్రచారం చేసి యుద్దానికి దిగటం ఆనవాయితీగా వస్తోంది.
Also Read : పోలాండ్ కు అమెరికా అదనపు బలగాలు