Babu behind it: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం తొలగించడానికి చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. హోదా అంశంలో బిజెపితో కలిసి టిడిపి నాటకాలాడుతోందని విమర్శించారు. బాబు తన పార్టీ ఎంపీలను బిజెపిలో చేర్చి రాష్ట్రానికి హోదా రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దిరెడ్డి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హోదా అంశంపై స్పందించారు. బాబు ఒత్తిడి మేరకే ఈ అంశాన్ని తొలగించారని ధ్వజమెత్తారు.
తాము మొదటినుంచీ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నామని, చంద్రబాబులాగా ప్యాకేజీ కోసం పాకులాడలేదన్నారు. సిఎం జగన్ ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే ఆ విషయంలో ఎలాంటి రాజీ పడబోరని, హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. హోదాపై మాట్లాడే హక్కు టిడిపికి లేదన్నారు. బాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నరన్నారు. రాష్ట్రంలో బిజెపి, జనసేన నామమాత్రంగానే ఉన్నాయని, అందుకే వారు లోపాయికారీగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నారని, వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేలనతో టిడిపి పొత్తుపెట్టుకునే అవకాశాలున్నాయని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. ఎవరెవరు కలిసి వచ్చినా గతంలో కంటే ఎక్కువ ఓట్లు, సీట్లతో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఫలాయన వాదమా? చంద్రబాబు