Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో యూ ముంబాపై జైపూర్; బెంగుళూరు పై పాట్నా, తమిళ్ పై పూణే విజయం సాధించాయి.
జైపూర్ పింక్ పాంథర్స్- యూ ముంబా జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 44-28తో జైపూర్ ఘన విజయం సాధించింది. ఆట తొలి భాగంలో 17-14తో ఆధిక్యం సంపాదించిన జైపూర్ మలి భాగంలో జూలు విదిల్చి 27-14తో తిరుగులేని పైచేయి ప్రదర్శించింది. మ్యాచ్ ముగిసే నాటికి 16 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్-14, బ్రిజేంద్ర సింగ్-8 పాయింట్లతో జట్టు విజయానికి దోహదం చేశారు.
పాట్నా పైరేట్స్- బెంగుళూరు బుల్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 36-34 తో పాట్నా గెలుపొందింది. ఆట ప్రథమార్ధంలో 19-14 తో పాట్నా ఆధిక్యం ప్రదర్శించింది. ద్వితీయార్ధంలో బెంగుళూరు పుంజుకుని పాట్నాకు చుక్కలు చూపించింది, 20-17 తో ఓ దశలో బెంగుళూరు విజయం సాధిస్తుందనిపించింది. అయితే చివర్లో పాట్నా పుంజుకుని బెంగుళూరును నిలువరించగలిగింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పాట్నా రైడర్ మోను గోయత్ 9 పాయింట్లతో రాణించాడు.
పునేరి పల్టాన్ – తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 43-31తో పూనే విజయం సాధించింది. టై అయ్యింది ఆట ప్రథమార్ధంలో 15-14 తో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఆధిక్యం సంపాదించిన పూనే ద్వితీయార్ధంలో మరింత దూకుడు ప్రదర్శించి 28-17తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి 12 పాయింట్ల ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకుంది. పూణే ఆటగాళ్ళు మోహిత్ గయత్-10; అస్లాం ఇమాందార్-9 పాయింట్లు సంపాదించారు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (80 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (65); యూపీ యోధ (63); హర్యానా స్టీలర్స్(63); బెంగుళూరు బుల్స్ (61); పునేరి పల్టాన్ (60) టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: హర్యానా, బెంగుళూరు, గుజరాత్ విజయం