కన్నడ ప్రజల మనోభావాలను కించపపరచినందుకు గూగుల్ భేషరతుగా క్షమాపణ చెప్పింది. భారత దేశంలో ‘అగ్లీ’ భాష ఏది అని సెర్చ్ చేస్తే ‘కన్నడ’ అని సమాధానం వచ్చేలా గూగుల్ లో కనిపించింది. దీనిపై కన్నడ భాషాభిమానులు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రామాణికతతో సర్వే చేశారంటూ దుమ్మెత్తి పోశారు.
తమ భాషను కించపరిచినందుకు గూగుల్ వెంటనే క్షమాపణ చెపాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కర్నాటక అధికార భాషా శాఖా మంత్రి అరవింద్ లింబావాలి హెచ్చరించారు. కన్నడ భాషకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని, తరతరాలుగా ఈ భాష తమకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పారు. పార్టీలకతీతంగా నేతలు గూగుల్ పై మండిపడ్డారు.
పరిస్థితి అర్ధం చేసుకున్న గూగుల్ అది తమ వ్యక్తిగత అభిప్రాయం కాదని, అలాంటి ఉద్దేశం తమకు లేదని వెల్లడించింది. కన్నడ ప్రజల మనోభావాలు కించపరిచిన ఆ ప్రశ్నను తొలగిస్తున్నామని, కన్నడ ప్రజలను క్షమాపణ కోరింది.