Rasheed met CM: భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. షేక్ రషీద్‌ను అభినందించిన సీఎం జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు ప్రకరించారు. రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలంతో పాటు ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తామని సిఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు.
షేక్ రషీద్ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ రషీద్ కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఇండియాదే అండర్ 19 వరల్డ్ కప్