Corruption House: గృహ నిర్మాణ పథకంలో ఐదువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వైసీపీ నేతలు పేదల వద్ద ముందుగానే తక్కువ రేటుకు స్థలాలు కొని వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అధిక రేట్లకు అమ్మారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్ళపట్టాలు ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం, ఏమాత్రం నివాస యోగ్యం కాని చోట్ల స్థలాలు కేటాయించి గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు.
అమరావతి ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడ్కో ఇళ్ళపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పది జిల్లాల్లో టిడ్కో ఇళ్ళ పరిస్థితిని వివరిస్తూ జిల్లాల వారీగా ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు. టిడిపి అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ఈ దేశంలో అసలు గృహ నిర్మాణ పథకాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోగా… తాము కట్టించిన ఇళ్ళను పేదలకు అందించలేని దుస్థితిలో ఉందనితమ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదని నిత్యం వైసీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తుంటారని, కానీ తాము అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల 60 వేల ఇళ్ళు నిర్మించామని వారే చెప్పారని, వీటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏటా ఐదు లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తామని పేదలకు వాగ్దానం చేసిన జగన్ ఈ మూడేళ్ళలో కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించారని ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పేదల గృహ నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని, ఇది శోచనీయమన్నారు
రాష్ట్రంలో అసలు ఇళ్ళు లేని పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో పట్టణ పేదల కోసం సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్ళ పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వంలో తాము చేపట్టామని చెప్పారు. తాము 3 లక్షల 16 వేల ఇళ్ళను ప్రారంభించి 2 లక్షల 62వేలు పూర్తి చేశామని ఈ ప్రభుత్వానికి సమయం ఉంటే వాటిని ప్రారంభించి పేదలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
Also Read : నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు