ఆంద్రప్రదేశ్ విభజన దారుణం అని గత ఎన్నికల్లో మాట్లాడిన మోడీ..బిడ్డను ఇచ్చి తల్లిని చంపారని అన్నాడని మంత్రి కేటిఅర్ విమర్శించారు. మళ్ళా పార్లమెంట్ లో తలుపులు మూసి అన్యాయంగా విభజన చేశారని అన్నారని, బిల్లు ఓటింగ్ కు వస్తే దర్వాజా బంద్ చేసే ఓటింగ్ చేస్తారని తెలియనోడు మన ప్రధాని అని కేటిఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆగన్న ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటిఆర్ బిజెపి నేతల తీరుపై విమర్శలు సంధించారు. అభివృద్ధి పథంలో వెళుతున్న తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నావా మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్దికి, బతుకును అడ్డుగా ఉండేలా ప్రవర్తిస్తున్న బిజెపిని బొంద పెట్టండని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
దేశంలో ఒక తప్పు జరిగిందని, నిన్ను(మోడీ) నమ్ముడే తప్పు అయిందని కేటిఆర్ మండిపడ్డారు. నమో అంటే నమ్మించి మోసం చేసినోడు మోదీ అని జివితాల్ని మార్చమని ప్రధానిని చేస్తే జీవితా భీమా లేకుండా చేస్తుండని ధ్వజమెత్తారు. ఏది అడిగినా మోడీ సమాధానం చెప్పడన్నారు. మూడేళ్ళలో బండి సంజయ్ వేములవాడ రాజన్న కోసం మూడు పైసలు తెచ్చిండా అని ప్రశ్నించిన మంత్రి ఎంపీగా ఎందుకు ఉన్నావ్ ఏమి ఉద్దరిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అయోధ్య లో రామమందిరం కడితే ఇక్కడి వేములవాడ కి ఒక్క రూపాయి తేవాయే…తెలంగాణకు ప్రధానమంత్రి మోదీ కాదా… కేవలం ఉత్తర భారత దేశానికే పీఎం వా అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏమి నాయకుడో అర్థంకాదని, మేడారం జాతరకు 2 కోట్లు ఇచ్చిండు అసలు కుంభమేళా కు 300 కోట్లు ఇచ్చి మినీ కుంభమేళాగా ఉన్న మేడారం కు 2 కోట్లేనా ఇచ్చేది అని కేటిఆర్ ప్రశ్నించారు. బిజెపి అంటే బక్వాస్ జాదా పార్టీ అని హిందుత్వ పార్టీ అయితే బండి సంజయ్ వేములవాడ కు వెయ్యి కోట్ల నిధులు తీసుకురా అని సవాల్ విసిరారు. తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తే బీజేపీ బట్టలిప్పి ప్రజలు కొట్లాడతారని హెచ్చరించారు. గల్లీ టు ఢిల్లీ దాకా మనమే ఉన్నామని, కేసీఆర్ ను మాట అంటే ఉరుకునేదే లేదన్నారు. బిజెపి వాళ్ళు హద్దులు దాటితే చుక్కలు చూపిస్తామన్న కేటిఆర్ మా నాయకులను గాని పార్టీని గాని ఎవరైనా ఒక్క మాట అంటే కేసీఆర్ లా ఫిరంగులై గర్జిస్తామని స్పష్టం చేశారు.