The sculptor: తెలుగు సినిమా 1950 నాటికి తన రూపు రేఖలను మార్చుకుంటూ .. తనని తాను తీర్చిదిద్దుకుంటూ వచ్చింది. ఆ సమయంలోనే సినిమా పట్ల గల ఆసక్తితో .. ఊత్సాహంతో ఎంతోమంది కళాకారులు ఆ దిశగా అడుగులు వేశారు. అలా గుంటూరు ప్రాంతం నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువే. గుంటూరు జిల్లా ‘పెదపులివర్రు’లో జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్ కూడా సినిమా రంగం పట్ల మక్కువ పెంచుకుని మద్రాసు చేరుకున్నారు. అక్కడే ఆయన సినిమా పరిశ్రమను చాలా దగ్గరగా చూశారు .. సినిమాపై ఒక అవహగాన పెంచుకున్నారు .. తాను అక్కడ ఏం చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చారు.
మద్రాసు వెళ్లిన ఆయన ముందుగా అక్కడ నిలదొక్కుకోవడం కోసం .. నెలకి ఎంతో కొంత వచ్చే ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నారు. ఒక స్టూడియోలో రికార్డిస్టుగా చేరారు. ఆ పనిని ఆయన సిన్సియర్ గా చేసే తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ఆయనకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఆదుర్తి సుబ్బారావు సిద్ధహస్తుడు. అభిరుచులు .. అభిప్రాయాలు కలవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దాంతో ఆయనతో కలిసి ‘ఇద్దరు మిత్రులు’ .. ‘మూగమనసులు’ .. ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
అక్కడ సంపాదించిన అనుభవంతో ఆయన ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి నుంచి ఆయనను చాలా దగ్గరగా చూస్తూ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఛాన్స్ ఇచ్చారు. అప్పటివరకూ నడుస్తూ వచ్చిన ట్రెండ్ ను గమనించిన విశ్వనాథ్, అందుకు భిన్నమైన సినిమాలను తెరకెక్కించి తన ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నారు. సినిమాకి కళను జోడించి కళాత్మకమైన చిత్రాలను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నానికి నిదర్శనంగా వచ్చిన సినిమానే ‘సిరి సిరి మువ్వ’.
విశ్వనాథ్ తన కెరియర్ తొలినాళ్లలో శోభన్ బాబుతో చేసిన ‘చెల్లెలి కాపురం’ .. ‘కాలం మారింది’ .. ‘శారద’ .. ‘జీవన జ్యోతి’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆయన సినిమాల్లో కథానాయకుడు ఆకాశంలో నుంచి ఊడిపడడు .. సగటు వ్యక్తిని కథానాయకుడిగా చేసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన తన ప్రత్యేకతను చూపించారు. ‘శంకరాభరణం’ .. ‘శుభోదయం’ .. ‘సప్తపది’ .. ‘శుభలేఖ’ వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఒక వయసు మళ్లిన వ్యక్తిని కథానాయకుడిగా ఎంపిక చేసుకుని, సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ సినిమాతో అఖండ విజయాన్ని అందుకోవడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది.
అలాగే ఆయన సినిమాల్లో కథానాయికలు సున్నితంగా .. సుకుమారంగా ఉంటారు. బరువు బాధ్యతలు .. ఆచారవ్యవహారాలు తెలిసినవారు. కట్టుబాట్లను కంటి చూపుతో కూడా దాటనివారు. వాళ్లంతా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్త్రీ ప్రధానమైన పాత్రలతో ఆయన అల్లుకున్న కథలు కూడా అనూహ్యమైన విజయాలను అందుకున్నాయి. అందుకు ఉదాహరణగా ‘శారద’ .. ‘ఓ సీతకథ’ .. ‘సీతామాలక్ష్మి’ వంటి సినిమాలు కనిపిస్తాయి. ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ తరువాత తాను అప్పటివరకూ కొన్ని పాత్రల వైపు నుంచి మాత్రమే ఆవిష్కరిస్తూ వస్తున్న కళను, ఆయన పూర్తి కథగా మార్చేశారు.
అలా సాహిత్యం .. సంగీతం .. నాట్యం వంటి కళలు ఆయన కథల్లో ఒదిగిపోయాయి. ఆ సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల గుండె గదుల్లో దాగిపోయాయి. ఆ జాబితాలో ‘సిరివెన్నెల’ .. ‘సాగర సంగమం’ .. ‘స్వాతిముత్యం’ .. ‘స్వాతికిరణం’ .. ‘శ్రుతిలయలు’ .. ‘స్వర్ణకమలం’ మొదలైన సినిమాలు కనిపిస్తాయి. సాధారణమైన జీవితాలకు అసమానమైన కళను పెనవేస్తూ ఆయన ఆవిష్కరించిన సినిమాలు తెలుగు సినిమా సముద్రంలో అపురూపమైన ఆణిముత్యాలు. మది గదిలో భద్రంగా దాచుకునే జాతిరత్నాలు అని చెప్పచ్చు.
ఇక విశ్వనాథ్ వారి సినిమాల్లో కథాకథనాలు ప్రేక్షకులను ఎంతగా అల్లుకుపోతాయో, పాటలు కూడా అంతగానే పెనవేసుకుపోతాయి. దర్శకుడిగానే కాకుండా ఆయన నటుడిగా కూడా ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన స్థాయికి తగిన పెద్దరికంతో కూడిన పాత్రలతో మెప్పించారు. తెలుగు తెరకి ఒక నిండుదనాన్ని తీసుకుని వచ్చారు. రఘుపతి వెంకయ్య .. పద్మశ్రీ .. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు. ఈ రోజున ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆ కళాతపస్వికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.
(కె. విశ్వనాథ్ జన్మదిన ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ