Aero Sports: మహబూబ్ నగర్ పట్టణంలో 20 ఎకరాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏరో స్పోర్ట్స్ , అడ్వెంచర్ అకాడమీని ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తానని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్ వెల్లడించారు. ఈ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల యువత కు ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, పర్యాటక ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగవుతాయన్నారు. రాష్ట్రంలో పారా మోటోరింగ్ ఏరో స్పోర్ట్స్, అడ్వెంచర్స్ స్పోర్ట్స్ ను ప్రోత్సాహించేందుకు అనువైన వాతావరణం మహబూబ్ నగర్ లో ఉందన్నారు. బ్రెజిల్ లో ఏప్రిల్ 20 నుండి 30 వ తేది వరకు జరుగనున్న 11వ FAI వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ – 2022 లో మన దేశం తరుపున ఎంపికైన హైదరాబాద్ నగరానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ ను శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దేశంతో పాటు 30 దేశాలకు చెందిన 150 మంది అడ్వెంచర్స్ పైలెట్లు పాల్గొంటున్నారని, వారిలో మన రాష్ట్రానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అడ్వెంచర్స్ స్పోర్ట్స్, ఏరో స్పోర్ట్స్ లు యూరోపియన్ దేశాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సాహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాలైన లండన్, న్యూయార్క్, పారిస్, సిడ్నీ, మెల్బోర్న్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాల్లో ఏరో స్పోర్ట్స్, అడ్వెంచర్స్ స్పోర్ట్స్, టూరిజం లు పర్యాటకులను ఎంతో ఆకర్షించేందుకు దోహదం చేస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
పారా మోటోరింగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ లో భాగంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో నగరానికి బ్రాండింగ్ ను కల్పించేందుకు పారా మోటోరింగ్ ఏషియన్ ఛాంపియన్స్ షిప్ – 2022 ను హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టణాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించేందుకు FAI వరల్డ్ పారా మోటోరింగ్ అసోసియేషన్- స్విజర్లాండ్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ లు ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేశారన్నారని వివరించారు. వివిధ దేశాల నుంచి అడ్వెంచర్స్, ఏరో స్పోర్ట్స్ క్రీడాకారులు రాష్ట్రానికి వచ్చి శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Also Read : క్రీడల్లోనూ ఆదర్శం: శ్రీనివాస గౌడ్