Special Interest: నాడు టిడిపి, నేడు వైసీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వారి అస్త్యవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పితే నెపం కేంద్రంపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్ధిక సంక్షోభం వైపు రాష్ట్రం వెళుతోందని ఆరోపిస్తోన్న బిజెపి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక విధానాలపై మేధావులు, పార్టీ అధికార ప్రతినిధులు, మేధావుల విభాగం బాదులతో ఓ విశ్లేషనాత్మక సమావేశం రాష్ట్ర బిజెపి కార్యాయలంలో నిర్వహించింది.
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, ఇదే విషయాన్ని ప్రధాని మోడీ పార్లమెంట్ లో చెప్పారని అన్నారు. తమ పార్టీ మొదటి నుంచీ చిన్న రాష్ట్రాలకు, తెలంగాణా ఏర్పాటుకు కట్టుబడి ఉందని, అయితే విభజన ఓ క్రమ పద్దతిలో జరగలేదనే విషయాన్నే మోడీ చెప్పారని జీవీఎల్ వివరించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ పై ప్రధాని మోడీకి ఎంతో సానుభూతి ఉందని, అందుకే ప్రత్యేక శ్రద్ధ చూపి ఆర్ధికంగా ఎంతో సాయం చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఆరేళ్లలో ఏపీకి ఇచ్చినన్ని నిధులు మరే ఇతర రాష్ట్రానికీ ఇవ్వలేదని, రాష్ట్రంపై అభిమానం ఉంది కాబట్టే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. తమపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న పార్టీలు చర్చకు రావాలని జీవీఎల్ సవాల్ చేశారు.
విభజన తరువాత రాష్టంలోని సహజ వనరులను, మినరల్స్ ను సరైన విధంగా వాడుకోవడంలో టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని సమావేశంలో మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అనవసరమైన అంశాలవైపు ప్రజల దృష్టిని మరల్చుతూ, రాష్ట్ర అభివృద్ధి, పురోగతివైపు నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పరిపాలనా సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్దివైపు నడిపించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం అధికారంలోనే ఉండాలనే లక్ష్యంతోనే ఈ రెండు కుటుంబ పార్టీలు పనిచేస్తున్నాయని, ఇది రాష్ట్రానికి అరిష్టమన్నారు. రెండు పార్టీలు కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా నడిరోడ్డుపై నిలబెట్టాయన్నారు. రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఈ బాధ్యతను బిజెపి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ సిఎస్, బిజెపి నేత ఐవైయార్ కృష్ణా రావు కూడా పాల్గొన్నారు.