Is it moral? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై టిడిపి, బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని, వారి వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యం వేస్తుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కొలుసు పార్ధ సారథి తీవ్రంగా మండిపడ్డారు. వివాద రహితుడిగా, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడిన యువ మంత్రి గౌతమ్‌రెడ్డి అకాలమరణం.. తమతో పాటు రాష్ట్ర ప్రజలంతా బాధతో కన్నీటి వీడ్కోలు చెబుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని అయన విమర్శించారు. వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. అసలు వారు పశువులా లేక సంస్కారహీనులా, లజ్జా, బిడియం, మానవత్వం ఏమైనా ఉన్నాయా అనే సందేహం వస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పార్థసారధి మాట్లాడారు.
ఎవరినైనా చిరునవ్వుతో పలకరించి పక్కనకూర్చోబెట్టుకొని సమస్యలు పరిష్కరించే వ్యక్తి చనిపోతే మానవత్వం ఉన్నవారు ఎవరైనా బాధను వ్యక్తపరుస్తారని, విశాఖలో టీడీపీ నాయకుడు సంస్కార హీనంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గౌతమ్‌రెడ్డి ఎంత సన్నిహితుడో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై నేడు బిజెపి నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలపై కూడా పార్థసారథి ఘాటుగా స్పందించారు.
నోరుంది కదా అని ఏం మాట్లాడినా చెలామణి అవుతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనుకుంటున్నారని, రూ.15 వేల కోట్లు విలువ చేసే 6 ప్రాజెక్టులు ఇచ్చామని, దానితోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నట్లు అయన మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుకు నాడు చంద్రబాబు చేసిన రూ.3.57లక్షల కోట్లు అప్పు కనబడలేదా అని ప్రశ్నించారు. నాడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదని నిలదీశారు.
కరోనా మహమ్మారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయి 1.5 లక్షల పిల్లలు తెలంగాణా రాష్ట్రంలో స్కూల్స్ మానేశారాణి, ఈ విషయాన్ని ఈనాడు పత్రికలోనే రాశారని, కానీ, ఆంధ్రరాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని వివరించారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. చంద్రబాబు మ్యూజిక్‌కు ఏపీ బీజేపీ నాయకులు డ్యాన్స్ లు వేస్తున్నారని. చంద్రబాబుకు తాళాలు, మద్దెలదరువు వేయడానికి జీవీఎల్, ఐవైఆర్ వచ్చారని వ్యాఖ్యానించారు.
Also Read : రాష్ట్రంపై మోడీకి ప్రత్యేక శ్రద్ధ : జీవీఎల్