Self Respect: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సోదరులు కల్వకుంట్ల తారకరామారావు గారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తే .. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా తరఫున, మా నిర్మాతల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”
“నిజమైన కళాకారులకు కులం .. మతం .. ప్రాంతం అనేది పట్టదు. ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు చిత్రపరిశ్రమని హైదరాబాద్ తీసుకుని వచ్చిన తరువాత కేసీఆర్ గారు మరింతగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నారు. అందుకు మా అందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా అనేది లేకపోతే నా ఉనికి ఉండేది కాదు. సినిమా నాకు ఇచ్చిన భిక్షనే ఇంత మంది అభిమానం. ఇంత మంది గుండెల్లో పెట్టుకున్నందుకు ఎంతో కొంత చేయాలి మన దేశానికి .. మన రాష్ట్రానికి .. మన ప్రాంతానికి .. మనవాళ్లకి అనిపిస్తుంది”
“సినిమా తప్ప నాకు మరొకటి తెలియదు .. సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. అందుకోసమే ఒక తొలి ప్రేమ .. ఒక ఖుషి ఎంత బాధ్యతగా చేశానో అలాగే ఈ సినిమాను కూడా అంతే బాధ్యతగా చేశాను. ప్రజా జీవితంలో ఉంటూ కూడా ప్రతి సినిమాను మనసు పెట్టి ముందుకు తీసుకుని వెళుతున్నాను. నా రాజకీయ కార్యక్రమాలకి వీలుగా షెడ్యూల్స్ ను మార్చుకుంటూ నిర్మాతలు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. పరిశ్రమ అందుబాటులో ఉంటే యువశక్తి బయటికి వస్తుందనడానికి ఉదాహరణ దర్శకుడు సాగర్”
“తను యూఎస్ లో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఈ రోజున పరిశ్రమలో ఒక బలమైన దర్శకుడిగా ఎదుగుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులను చూసినప్పుడు వీళ్లంతా సినిమాల్లోకి వస్తే.. బాగుంటుంది గదా అనుకునేవాడిని. అలాంటి కళాకారులను గుర్తించిన తమన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అహంహారానికి .. ఆత్మ గౌరవానికి మధ్య జరిగే యుద్ధం. ఇది ఒక మలయాళ సినిమాకి రీమేక్. ఒక పోలీస్ అధికారికీ .. ఒక రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ ఇది”
“ఆ సంఘర్షణను చాలా అందంగా రచన చేసిన త్రివిక్రమ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఆయనే వెన్నెముక. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనే అందరినీ ముందుండి నడిపించాడు. ఇక రానా .. నిత్యామీనన్ .. సంయుక్త అంతా కూడా అద్భుతంగా చేశారు. రవి కె చంద్రన్ కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది. ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ కీ .. ఎడిటర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మీకు నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాను. నా కర్తవ్యం బాగా చేయడమే .. సినిమాను ఎలా ఆదరించాలానేది నేను ఎప్పుడూ చెప్పలేదు. మీరు ఆదరించి .. ఆనందిస్తే అదే సంతోషం .. థ్యాంక్యూ .. జై హింద్” అంటూ ముగించారు.