CM Review: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై మొన్న కేంద్రమంత్రికి లేఖ రాసిన సిఎం నేడు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడ చిక్కుపోయిన విద్యార్ధులను వెనక్కు తీసుకు రావాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని జయశంకర్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ పక్కదేశాలకు తరలించి అక్కడనుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు.
ఈ విషయమై సిఎం జగన్ అంతకుముందు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ స్పెషల్ ఆఫీసర్ (ఇంటర్నేషనల్ కోపరేషన్) జితేష్ శర్మ, ఐ ఎండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్ కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సిఎంకు వివరించారు. కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సిఎం ఆదేశించారు.
అధికారులకు సిఎం సూచనలు:
రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి
వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి
ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలి
కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలి
అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలి
అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలి