ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభం రెండ్రోజులు వాయిదా పడింది. జూన్ 7న సోమవారం బదులుగా 9న బుధవారం ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాంతాల్లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సిఎం కేసియార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వీటిని తొలుత జూన్ 7న సోమవారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అన్ని కేంద్రాల్లో ఒకేసారి మంత్రులతో వీటికి శ్రీకారం చుట్టాలని సిఎం భావిస్తున్నారు. మంత్రులు లేని జిల్లాల్లో ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖులతో వీటిని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్..జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, వైద్యం లో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్ష (డయాగ్నోసిస్) లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.