Russia Ukraine Peace :
రష్యా – ఉక్రెయిన్ మధ్య కొద్దిసేపటి క్రితం చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్ లోజి గోమెల్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో సమావేశం ప్రారంభం అయింది. ప్రిప్యాత్ నది తీరంలో జరుగుతున్న ఈ సమావేశం ద్వారా రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత తగ్గాలని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ తరపున రక్షణ మంత్రి ఒలేస్కి రేజ్నికోవ్ నేతృత్వంలో బృందం పాల్గొంటుండగా రష్యా తరపున సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి వ్లాదిమిర్ మేదిన్స్కి నేతృత్వంలో గ్రూపు పాల్గొన్నది. ఆదివారమే చర్చల ప్రతిపాదన వచ్చినా ఉక్రెయిన్ అందుకు అంగీకరించలేదు. బెలారస్ కాకుండా మరో చోట చర్చలు జరుపుతామని ఉక్రెయిన్ ప్రతిపాదించింది. అయితే బెలారస్ అధ్యక్షుడు చొరవ తీసుకుని… ఆ నగరం ఏదో మీరే చెప్పాలని కోరటంతో చివరకు గోమెల్ ప్రాంతం ఫైనల్ అయింది.
రష్యా విమానాలు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు చర్చల ప్రక్రియ జరగటం శాంతి స్థాపనకు ఏ మేరకు తోడ్పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద్మీర్ జేలేన్సకీ అన్నారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే చర్చలు ఫలవంతమవుతాయని జేలేన్సకీ అన్నారు. దేశ ప్రజలకు ఇది క్లిష్ట సమయమని, ఇప్పటివరకు ఎనిమిది వందల మంది ఉక్రెయిన్ పౌరులు రష్యా దాడుల్లో చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వంవెల్లడించింది.