Tngo Meeting : ప్రభుత్వ ఉద్యోగస్తుల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే ప్రధాని మోడీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి మోడీ సర్కార్ ప్రభుత్వ విధానాలపై దేశ పౌరులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన చెప్పారు. టి యన్ జి ఓ స్ నల్లగొండ జిల్లా స్టాండింగ్ సమావేశాలను ఆయన నల్లగొండలో సోమవారం ప్రారంభించారు.ఆ సంఘం రూపొందించిన 2022 డైరీ మరియు క్యాలెండర్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంపదను పెంచాలి పెరిగిన సంపదను పేదలకు పంచాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే పెరిగిన సంపదను అయిన వారికి అందిన కాడికి దోచి పెట్టాలి అన్నది ప్రధాని మోడీ ఆలోచన అని ఆయన ఎద్దేవాచేశారు. నానాటికి దేశంలో దారిద్ర్య రేఖ పెరిగి పోతున్నదని అందుకు ప్రధాని మోడీ అవలంబిస్తున్న విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. పి ఆర్ సి,ఇంక్రిమెంట్లు, ఫిట్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు కోట్లాడి సాదించుకుంటే ఇన్ కం ట్యాక్స్ రూపంలో మోడీ సర్కార్ కొల్ల గొడుతుందని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగస్తులకు పెరిగిన జీత,భత్యాలకు అనుగుణంగా ఇన్ కం ట్యాక్స్ పరిధిని పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం మీనమీసాలు లెక్కిస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. అర్థం పర్థం లేని ఆరోపణలు, అపోహలు, బురద చల్లే ప్రయత్నాలను అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు ఎరిగి నడుచుకున్న టి యన్ జి ఓ నాయకులు అనేక సమస్యలను సృహుద్బావా వాతావరణం లో పరిష్కరించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ విజయంలో మాత్రమే కాదు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందన్నారు. ఉద్యోగుల సహకారంతో రాష్ట్రంలో కరువు, ఆకలి,దరిద్రం మీద అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నామన్నారు. అన్నింటికి మించి ఇంజనీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఉద్యోగస్తుల శ్రమ ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ అద్భుతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించారు అంటే అందుకు ఉద్యోగులు పడిన శ్రమ ఎంతో అన్నది ఇట్టే తేలి పోతుందన్నారు.
నల్లగొండ జిల్లాకు ఫ్లోరోసిస్ రూపంలో కబళించిన ఫ్లోరిన్ మహమ్మరిని ప్రారద్రోలేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు పరిచిన మిషన్ భగీరథ పధకం విజయవంతం చేయడంలోనూద్యోగస్టుల పాత్ర కీలకమైన పాత్ర పోషించిందన్నారు. అటువంటి ఉద్యోగుల జేబులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న మోడీ సర్కార్ ను ఎండ గట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రవీందర్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ ,నాయకులు ప్రతాప్, మురళి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి కిరణ్ కుమార్ కార్యదర్శి నివేదికను సమర్పించారు.