కరోన మహమ్మారిని ఎదుర్కునే యంత్రాంగం లేక ప్రపంచ దేశాల నుంచి సాయం అందక ఆఫ్ఘానిస్తాన్ అల్లాడుతోంది. ఆఫ్ఘన్ ను ఆదుకునేందుకు ముప్పై లక్షల వ్యాక్సిన్ డోసులు అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) హామీ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో రావల్సిన వ్యాక్సిన్ ఈ రోజు వరకు అందలేదు. వివిధ కారణాల వాళ్ళ ఆగష్టు వరకు అందే అవకాశం లేదని డబ్ల్యు.హెచ్.ఓ నుంచి కాబూల్ కు సమాచారం అందింది.
వ్యాక్సిన్ అందక ప్రజలు త్రిశంకు స్వర్గంలో చిక్కుకున్నారని ఆఫ్ఘన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి గులాం దస్తగీర్ నజారి ఆవేదన వ్యక్తం చేశారు. టీకా సాయం చేయాలని చాలా దేశాలను వేడుకున్నామని, అందిస్తామని హామీ ఇచ్చిన వారే కాని ఎవ్వరు ఇవ్వలేదన్నారు. నెల రోజుల నుంచి కోవిడ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని నజారి వెల్లడించారు.
36 కోట్ల ఆఫ్ఘన్ జనాభాలో కేవలం ఆరు లక్షల మందికి మాత్రమె వ్యాక్సిన్ మొదటి డోసు అందింది. రెండో డోసు ఎంతమందికి వేశారో ఎవరికీ తెలియదు. కోవిడ్ పరిక్షలు చేయటం కూడా అంతంత మాత్రమె. దేశ వ్యాప్తంగా రోజుకు 25 వేల టెస్టులు చేస్తున్నారు.
భారత్ నుంచి వచ్చిన వారి వల్లే కరోన ఆఫ్ఘన్ కు చేరిందనే అనుమానాలున్నాయి. ఇండియా నుంచి ప్రతి రోజు పది విమానాలు కాబూల్ చేరుకుంటున్నాయి. ఇందులో విద్యార్థులు, వైద్యం కోసం వెళ్ళిన వారు ఎక్కువగా ఉన్నారు.
రోజు వారి కేసుల్లో మే 1 వ తేదిన 178 ఉండగా జూన్ రెండో తేది నాటికి 1500 కు పెరిగింది. కరోనకు వైద్యం అందించేందుకు కాబూల్ లో మాత్రమె ప్రత్యెక ఆస్పత్రి ఉంది. అందులో ఎప్పుడు ఫుల్. ఈ నెలలో మరో మూడు నగరాల్లో కోవిడ్ ఆస్పత్రులు ప్రారంబించినా సరిపోవడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు మూడు వేల మంది చనిపోయారు. ఇవి ఆస్పత్రుల్లో నమోదైన మృతుల సంఖ్య, ఇళ్ళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చనిపోయిన వారి సంఖ్య వేళల్లో ఉంటుందని సమాచారం. ప్రాణ వాయువు అందక చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
మరోవైపు కరోన తమను ఏమి చేయలేదని వాదించే వారు ఆ దేశంలో ఎక్కువగా ఉన్నారు. మాస్కులు పెట్టుకోవడం చాలా అరుదు. కరోన పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయటం లేదు.
తాలిబాన్ ల దాడులు, నాటో బలగాలు వెనక్కి వెళ్ళిపోవటం, కరోన కట్టడిలో ప్రజల నిర్లక్ష్య వైఖరి, ప్రపంచ దేశాల మొండి చేయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయం అందక ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి నది సముద్రంలో నావ లా తయారైంది.