Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉక్రెయిన్ పిలుస్తోంది

ఉక్రెయిన్ పిలుస్తోంది

Ukraine for MBBS:
ఎక్కడి తెలుగు ఊళ్లు?
ఎక్కడి ఉక్రెయిన్ కాలేజీలు?

ఎక్కడి భారతీయులు?
ఎక్కడి ఉక్రెయిన్ వైద్య కళాశాలల్లో చదువులు?

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించగానే…భారతదేశంలో, తెలుగు ఊళ్లల్లో ఒకటే దిగులు. ఒకటే గుబులు.

రష్యా- ఉక్రెయిన్ లలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ప్రపంచ దేశాలు ఏవేవి ఎవరివైపు ఎందుకున్నాయి? అన్నది వేరే విషయం. భారతదేశం నుండి ఇన్ని వేల మంది విద్యార్థులు ఏటా వైద్య విద్య కోసం ఎందుకు ఉక్రెయిన్ వెళుతున్నారు? అన్నదే ఇప్పుడు చర్చ.

మనదేశంలో ప్రత్యేకించి దక్షిణాదిలో ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం వల్ల అమెరికాకు కావాల్సిన మానవవనరులు పుష్కలంగా దొరికాయి. అక్కడ ఎమ్మెస్ చేసినవారిలో ఎంతమంది ఇంజనీర్లు మళ్లీ స్వదేశానికి వస్తున్నారు? అంటే సమాధానం దొరకదు.

వైద్య విద్యకు తీవ్రమయిన సీట్ల కొరత. ప్రయివేటు మెడికల్ కాలేజీలో ఎం బి బి ఎస్ కు కోటి, పి జి కి రెండు కోట్ల ఖర్చు అన్నది అందరికీ తెలిసిందే. దాంతో మధ్యతరగతిని ఉక్రెయిన్ ఊరిస్తోంది. ముప్పయ్ లక్షల ఖర్చుతో అక్కడ ఎం బి బి ఎస్ పూర్తి చేసి, భారత్ వచ్చి ఒక అర్హత పరీక్షలో పాసయితే చాలు. మహారాజుగా డాక్టర్ అయిపోవచ్చు. అవుతున్నారు. భవిష్యత్తులో అవుతూ ఉంటారు కూడా.

ఉక్రెయిన్ అకెడెమిక్ క్యాలెండర్ మొదలు కావడానికి ముందు తెలుగులో ఏ టీ వీ ఛానెల్ పెట్టినా…ఉక్రెయిన్ ఎం బి బి ఎస్ ఎంత గొప్పదో? అక్కడి హాస్టళ్లలో మన ఇడ్లి సాంబారు ఎలా వడ్డిస్తున్నారో? మన కుక్కట్ పల్లెలా ఉక్రెయిన్ కాలనీలు ఎలా ఉంటాయో? వివరిస్తూ అక్కడి కాలేజీలు, వారి తరఫున ఇక్కడి కన్సల్టెన్సీల ప్రత్యేక వాణిజ్య కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి.

ఉక్రెయిన్ వైద్య విద్యకోసం వెళ్లే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. అభినందించాలి. ఖండాంతరాలు దాటి దేశం కాని దేశంలో అలవాటు లేని ఉక్రెయిన్ అతిశీతల వాతావరణంలో చదువుకుంటున్న వారి ప్రయత్నం, పట్టుదల గొప్పవి.

ఉక్రెయిన్ లో అలా చదువుకుంటున్న ఒక కన్నడ వైద్య విద్యార్థి రష్యా దాడిలో కనుమూశాడు. ఆ తండ్రి శోకం కట్టలు తెంచుకుంది. ఆ శోకంలో ఆయన అన్న మాటలు ప్రభుత్వాల చెవికెక్కితే బాగుంటుంది. వాళ్ల అబ్బాయి చదువుల్లో ఎప్పుడూ 97 శాతం మార్కులతో ముందు వరుసలో ఉంటాడు. అయినా అతడి జీవితాశయమయిన ఎం బి బి ఎస్ సీటు ఇండియాలో రాలేదు. విధిలేక ఉక్రెయిన్ వెళ్లాడు. విధి వక్రించి ఇక తిరిగి రాలేదు. తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

ఏటా ఒక్క భారత్ నుండే ఉక్రెయిన్ వైద్య విద్యకోసం దాదాపు 20 వేల మంది విద్యార్థులు వెళుతున్నారు. హీనపక్షం ఒక్కొక్కరి మీద 30 లక్షల ఖర్చు అనుకుంటే…సంవత్సరానికి మనం ఉక్రెయిన్ కు ఇస్తున్నది అక్షరాలా ఆరు వేల కోట్లు. ఒక పదేళ్లలో మనం ఇచ్చినది అరవై వేల కోట్లు. ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ…తక్కువ మాత్రం ఉండదు.

“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న సూక్తిని పదే పదే వినిపించే మన పేరు గొప్ప భారత దేశం ఉక్రెయిన్ పాటి మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేకపోయిందా? ఇచ్చినా ఫీజులను అందుబాటులో ఉంచలేకపోయిందా? వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తామని అలవోకగా, చిటికెల పందిళ్లు వేసి చెప్పినవారు...తీరా తయారయ్యాక ఆ వ్యాక్సిన్లను పదిహేను వందల రూపాయలకు అమ్ముకుంటుంటే మెచ్చి పాదాభివందనాలు చేసే ప్రభుత్వాలు మనవి.

మన వైద్యం ప్రయివేటు గుప్పిట్లో. మన వైద్య విద్య కోట్లల్లో. వాటర్ బాటిల్ కూడా పదిహేను వందలు కాకుంటే…అదే పది వేలు. రెండు చుక్కల నీళ్లయినా తాగి బతికిపోతాం.

Ukraine

పిల్లలూ!
కలకాలం ఉండవులే యుద్ధాలు. రేపో మాపో ఉక్రెయిన్ మెట్టు దిగక తప్పదు. ఏదో ఒక సంధి కుదరక తప్పదు. బూడిద మిగిలిన ఉక్రెయిన్లో రష్యా కీలు బొమ్మ అధిపతి రాకపోడు. అప్పుడు అంతా శాంతి. శాంతి. శాంతి. మళ్లీ అన్ని గగనతలాల్లో అన్ని విమానాలు నిర్భయంగా, నిర్నిరోధంగా రెక్కలు విప్పి తిరుగుతాయి. మధ్యలో మానేసి వచ్చిన వైద్య విద్యను పూర్తి చేసి వద్దురుకానీ.

ఎన్ని కన్నీళ్లు? ఎన్నెన్ని బాధలు? ఎముకలు కొరికే చలిలో ఎన్నెన్ని కిలోమీటర్ల కాలినడకలు? విరుచుకుపడే ఎన్నెన్ని క్షిపణులు? చెవులు చిల్లులు పడే ఎన్నెన్ని బాంబులు?

మీలో చదివే సత్తా ఉన్నా, అప్పులు చేసి మీకు అండగా నిలబడే అమ్మానాన్నలు ఉన్నా…మీరు చదవడానికి మెడికల్ కాలేజీలను ఇచ్చే ఔదార్యం మాకు లేదు. ఆరోగ్యరంగం మీద దూరదృష్టి మాకు లేదు. కోటీశ్వరులు తప్ప సామాన్యులు వైద్య విద్యకు పనికిరాకుండా చేసిన మా ప్రయివేటు కుట్రలకు ప్రభుత్వం ఏమి చేసిందన్నది మీకు అనవసరం.

Ukraine

ఉక్రెయిన్ రష్యాతోనే యుద్ధం చేస్తోంది. మీరు పరిస్థితులతో, ప్రకృతితో, ఇక్కడి చిత్ర విచిత్ర వైద్య విద్యా విధానాలతో యుద్ధం చేస్తున్నారు. అర్హత పరీక్షల్లో మీరు పాస్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వచ్చు. మళ్లీ రాసి పాసవ్వచ్చు. కానీ మీరు జీవిత యుద్ధరంగంలో ఎప్పుడో గెలిచారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వస్తున్నవారు వైద్య యుద్ధ విద్యార్థులు. వారి డాక్టర్ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్య విద్య అందుబాటులోకి రావాలని కలకందాం.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:  

ఉక్రెయిన్ విషాదం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్