Social Media Power: సమర్ధులు మాత్రమే అభివృద్ధిపై ఆలోచిస్తారని, చేతగానివారే మతం, కులం, ప్రాంతం గురించి మాట్లాడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాడిద-గుర్రానికి తేడా తెలియనివారు అధికారంలోకి వచ్చారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో ‘ఐ-టిడిపి మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలా వ్యవహరించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియాకు ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఒకనాడు శ్రీ శ్రీ లాంటి కవులు సమాజంపై ఎన్నో కవిత్వాలు రాశారని, ఇప్పుడు శ్రీ శ్రీ కంటే బ్రహ్మాండమైన ఆయుధం సెల్ ఫోన్ అని బాబు అన్నారు. అమరావతికి కులం అంటగడతారా? అమరావతి మునిగిపోతుందంటారా? ప్రజలను కులం, మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటారా అని ప్రశ్నించారు. తెలుగుప్రజలే తన కులం, మతం, కుటుంబం అని చెప్పారు. అమరావతిని స్మశానం అని, భ్రమరావతి అని మాట్లాడడం దారుణమన్నారు. అందరూ ఆమోదించిన అమరావతిని వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. నిన్న అమరావతిపై హైకోర్టులో తీర్పు వస్తే కొన్ని మీడియా సంస్థల్లో కనీసం ఆ వార్త చూపించలేదని, మీరు చూపించకపోతే ఆగుతుందా, పొద్దు పొడవదా? సూర్యుడు ఉదయించడా? అని ప్రశ్నించారు.
అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారంచేసి గత ఎన్నికల్లో విజయం సాధించారని, తాను పనిమీదే ధ్యాస పెట్టి, ఇలాంటి దుష్ప్రచారంపై దృష్టి పెట్టలేదన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్ ను చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు.