ప్రజల అవసరాలను తెలుసుకొని, వారు అడగకముందే వాటిని అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వానికి ప్రజలందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆకాంక్షించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పం, వారు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సిఎం శ్రీకారం చుట్టారని చెప్పారు.
నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటియార్ తొలుత ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన 40 ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు, వారి చేత స్వయంగా గృహ ప్రవేశం చేయించారు. వెంకటాపూర్ సిరిసిల్లలో కలిసిపోయిందన్నారు. ఇదే ప్రాంతంలో త్వరలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, కూడా రాబోతుందని వెల్లడించారు. ఈ ప్రాంతం రూపురేఖలు మార్చివేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఇల్లుకట్టి చూడు- పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారని, తమ ప్రభుత్వం పేదవారి పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేస్తోందని, అదే విధంగా ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టి ఇస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని, ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదాయాన్ని ప్రజలకు అందించే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు.
తాను ఇక్కడికి వస్తుంటే కొందరు విమర్శలు చేశారని, కానీ వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పతకాలు అమలవుతున్నాయో లేదో చూసుకోవాలని కేటిఆర్ హితవు పలికారు. మాటలు చెప్పాడం, విమర్శలు చేయడం సులువైన పని అని.. కనీ విమర్శలు చేస్తున్నవారు ఏం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు.