“దేశ భాషలందు తెలుగు లెస్స” అని…తెలుగు మన సంస్కృతి సంప్రదాయాలకు ఆదెరువు అని, ఉపన్యసించుకునే తెలుగు వాళ్ళు మాటలవరకె పరిమితమయ్యారనడంలో అతిశయోక్తి లేదు.
ఆంగ్లంలో మాట్లాడితే ఉన్న అధికార దర్పం తెలుగులో మాట్లాడితే లేదని నమ్మే తెలుగు వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటుంది. అదేం పాపమో రాకున్నా వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడేస్తారు. వచ్చినా రానట్టు తెలుగులో ముద్దముద్దగా మాట్లాడుతూ ఉంటారు. సరదాగా ఎవరో అన్నారు – ఇద్దరు వచ్చీరాని హిందీలోనో ఆంగ్లంలోనో మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుగు వారై ఉంటారని!
పాఠశాలలకు, హోటళ్లకు కిరాణా షాపులకు, ఆఖరికి సెలూన్లకు కూడా తెలుగులో పేరు పెడితే నీచంగా ఉంటుందని రాయల్టీ కోసం ఆంగ్లంలో అర్థం కాని, అర్థం లేని, పేర్లను పెట్టి ఆనందించే వాళ్ళు కోకొల్లలు. అమ్మలు మమ్మీ లై… నాన్నలు డాడీలై… అందరూ అంకుళ్లయితే ఏం చేద్దాం?
కుక్కలకు కూడా తెలుగు పేర్లు పెట్టుకోవడం లేదంటే తెలుగు భాషకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో తెలుస్తుంది. ఈ సందర్భంలో “ప్రాచీన హోదాలూ” “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” ప్రశంశంసలూ భాషను ఎలా మెరిపిస్తాయో ఆలోచించాల్సిందే.
ఒకసారి అలా చూడండి…మన తెలుగింటి ఆడపడుచులకు నచ్చిన చినీచీనాంబరాలు…కొందరికి పంజాబీ డ్రెస్ అంటే ఇష్టం…మరికొందరికి అనార్కలీలు, ఇంకొందరికి మిడ్డీలు కాదంటే ప్యాంట్లు షర్టులు…ఇవి యువ మహిళా మణులకే కాకుండా అమ్మమ్మలకు కూడా ఆసక్తిదాయకమైనందుకు తెలుగు వేషంలో తెలుగుదనం ఎప్పుడో పలుచబడింది.
పరికిణీలు చీరలు చిత్రాల్లో, చిత్రలేఖనాలలో, కనిపించి… తెలుగుదనాన్ని గుర్తు చేస్తాయేతప్ప ఎవ్వరిని ఆకట్టుకోలేకపోతున్నాయి…మగవాళ్ళని పరిశీలిస్తే ధోతి కండువాలు మోటుగా అనిపించి టీ షర్టులు జీన్స్ ప్యాంట్లు షార్ట్ లెంతులు ఆపిల్ కట్లు మోజయ్యాయి. ఇంతటి మర్యాద చేస్తూ… తెలుగుదనానికి చోటెక్కడ ఉందని వింతగా ప్రశ్నిస్తుంటారు. తెలుగుదనాన్ని కోల్పోతున్నామని విపరీతంగా బాధ పడుతుంటారు.
ఒక్కసారి తిండి విషయానికి వద్దాం..గోంగూర పచ్చడి ఆవకాయ… జొన్న రొట్టె…రాగి అంబలి ఇప్పటి వాళ్ళకి అవసరం లేదు… టొమాటో సాస్, ఫ్లేవర్స్ వెనిగర్ వంటకాలు రుచులు పంచుతున్నాయి. చైనీస్ వంటకాలు రాజస్థాన్ గుజరాత్ స్వీట్ హోమ్ లు పంజాబీ ధాబాలు బెంగుళూరు అయ్యంగార్ బేకరీ లు కట్లెట్లు పానీపూరీలు కర్రీపఫ్ లు ఎగ్ పఫ్ లు తెలుగు భోజనంపై దాడి చేసేసాయి. కొబ్బరిబోండాలను మజ్జిగ సేవనాలను, కోకోకోలాలు కాఫీ టీలు ఏనాడో మరుగున పడగొట్టేశాయి.
తెలుగు సినిమాలకు తెలుగు హీరోయిన్లు తెలుగు యాక్టర్లూ పనికిరారు. పరాయి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడం ఫ్యాషన్.
ఇలా సాధ్యమైనంతవరకు తెలుగు భాషకు తెలుగు వేషానికి, తెలుగు రుచులకు మంగళం పాడుతూ తెలుగు భాష బాగుండాలి; సంస్కృతి అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉంటాం. మనం ఒకరం తప్ప అందరూ తెలుగు కోసం పాటుపడాలి అనుకోవడం సమంజసం కాదు.
“దేశ భాషల యందు దివ్యమైనది యంటు ఆంధ్ర భోజుని నుతులందె తెలుగు
ఆంగ్లేయుడా బ్రౌనుడానందమునసేయు
సేవలన్ గొన్నట్టి చేవ తెలుగు
ఇదిటాలియన్ ఆఫ్ద ఈస్టను ఖ్యాతిని
గడియించు కొన్నట్టి ఘనత తెలుగు
ప్రాచీన భాషగా పట్టాభిషేకంబు సత్కారమొందిన జాణ తెలుగు
విశ్వ విఖ్యాతమైనట్టి విషయ తెలుగు
నిత్య నూతన సౌందర్య నియత తెలుగు
విశ్వమున సూర్య చంద్రులు వెలుగుదాక
తెలుగు వెలుగుల విరజిమ్మి నిలుచుగాక
తెలుగులో మాట లాడుట; తెలుగు కావ్య
ములను చదువుట; భాష సమ్మోహనమును
ఎరుక గొనుట; భాషణ చతురుత గలిగి
యుండుట; తెలుగు భాషకు యొప్పు సేవ”
-అమరవాది రాజశేఖర శర్మ