ICC Women WC: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా 107 పరుగులతో ఘనవిజయం సాధించింది. రాజేశ్వరి గయక్వాడ్ తో పాటు మిగిలిన బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ఇండియా విసిరిన 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 137 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది.
మౌంట్ మాంగనూయి లోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు పరుగులకే తొలి వికెట్ (షఫాలీ వర్మ- డకౌట్) కోల్పోయింది. రెండో వికెట్ కు స్మృతి మందానా, దీప్తి శర్మ 92 పరుగులు జోడించారు. అయితే జట్టు స్కోరు 96 వద్ద దీప్తి శర్మ(40), 98 వద్ద స్మృతి (52) ఇద్దరూ ఔటయ్యారు. కెప్టెన్ మిథాలీ(9); హర్మన్ ప్రీత్ కౌర్(5), రిచా ఘోష్(1) రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. ఈ దశలో స్నేహ రానా, పూజా వస్త్రాకర్ లు నిలబడి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పూజా-67 (59 బంతులు, 8 ఫోర్లు) చేసి ఔట్ కాగా, రానా 53 పరుగుల(48బంతులు, 4ఫోర్లు) తో నాటౌట్ గా నిలిచింది. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు, నిదా దార్ చెరో రెండు; డయానా బేగ్, అనం అమిన్, ఫాతిమా సనా తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ మహిళలు 28 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయారు ఓపెనర్ సిద్రా అమీన్-30; డయానా బేగ్-24 మాత్రమే రాణించారు. మిగిలినవారు విఫలం కావడంతో43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
67 పరుగులు చేసిన పూజా వస్త్రాకర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై ఆసీస్ విజయం