we condemn it: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అందువల్ల సాంకేతికంగా మన రాజధానిగా హైదరాబాద్ అవుతుందని, దీన్ని ఆధారం చేసుకునే కోర్టులు రాజధానిపై వ్యాఖ్యలు చేసి ఉంటాయని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని బొత్స చెప్పారు. నేడు మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం బొత్స మీడియాతో కాసేపు ముచ్చటించారు. మనం రాజధానిని నిర్ణయించిన తరువాత తీర్మానంచేసి పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుందని, పార్లమెంట్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని అప్పుడే అధికారికంగా అమరావతి రాజధాని అవుతుందని బొత్స విశ్లేషించారు.
జిల్లాల విభజనకు, మూడు రాజదానులకు సంబంధం లేదని, రెండూ వేర్వేరు అంశాలని మంత్రి వివరిచారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో పెట్టామని, అందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు రాజధానులు అనేవి రాష్ట్ర పరిపాలనను వికేంద్రీకరించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని వివరించారు. తమ ప్రభుత్వ విధానం, అభిప్రాయం ప్రకారం అమరావతి శాసన రాజధాని అని బొత్స అన్నారు.
నేడు గవర్నర్ ప్రసంగం సమయంలో టిడిపి సభ్యులు వ్యవహరించిన తీరును బొత్స తీవ్రంగా ఖండించారు. సభకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై కూడా తర్జనభర్జన పడ్డారని ఎద్దేవా చేశారు. వారికి క్షణికావేశం ఎక్కువని, అందుకే నిర్ణయం తీసుకుని మళ్ళీ మార్చుకున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి: గవర్నర్ ప్రసంగం: టిడిపి నినాదాలు