పెట్రో ధరలు ప్రజలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రో ధరలు పెరగలేదనే వార్తలను మంత్రి హర్దీప్ కొట్టిపారేశారు. చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి పెట్రో ధరల్ని నిర్ణయిస్తాయని, ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొంత మార్పు ఉంటుందని కేంద్రమంత్రి నర్మగర్భంగా చెప్పారు.
అయితే దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని, ప్రజలను ఇబ్బంది పెట్టబోమని… ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ విమర్శించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయని, ఇక పెట్రో రేట్లు పెరగటం ఖాయమని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ట్వీట్ చేశారు. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఆఫర్ ముగిసిందని అందులో పేర్కొన్నారు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన కేంద్రమంత్రి ఇప్పుడు వాహనాల్లో పెట్రోలు నింపినా.. నింపక పోయినా దేశంలో ఎన్నికలు వస్తూ పోతుంటాయని అన్నారు. మన యువజన నాయకుడు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే పెట్రో తప్పదు…అయితే పెట్రో ధరలకు ఏ మేరకు రెక్కలు వస్తాయో… ఎంతవరకు పెరుగుతాయనేది వేచి చూడాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో కేంద్రప్రభుత్వం పెట్రో ధరలపై నిర్ణయం తీసుకోనుంది.