India beat Windees: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై ఇండియా 155 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇండియా జట్టులో స్మృతి మందానా, హార్మన్ ప్రీత్ కౌర్ లు సెంచరీ లతో కదం తొక్కారు. 318 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి- యస్తికా తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. యస్తికా 31 పరుగులు చేసి ఔటయ్యింది. కెప్టెన్ మిథాలీ (5) మరోసారి విఫలం కాగా, దీప్తి శర్మ 15 పరుగులే చేసి వెనుదిరిగింది. 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో స్మృతి, హర్మన్ ప్రీత్ నాలుగో వికెట్ కు 184 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి-123 (119బంతుల్లో 13 ఫోర్లు, 2సిక్సర్లు ); హార్మన్ ప్రీత్-109 (107బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లు ) పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో మహమ్మద్ రెండు వికెట్లు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ మహిళలు తొలి వికెట్ కు 100 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని ఇండియా బౌలర్ స్నేహ రానా విడదీసింది. 46 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్సర్ తో 62 పరుగులు చేసి ఓపెనర్ దొట్టిన్ ఔటయ్యింది. కైసియా నైట్-5 ; కెప్టెన్ టేలర్-1 త్వరగా ఔటయ్యారు.మరో ఓపెనర్ హేలీ కూడా 36 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసి స్నేహ రానా బౌలింగ్ లోనే ఔటయ్యింది. ఆ తర్వాత వచ్చిన బాట్స్ విమెన్ విఫలం కావడంతో విండీస్ ఓటమి పాలయ్యింది. ఇండియా బౌలర్లలో స్నెహ్ రానా మూడు; మేఘన సింగ్ రెండు; గోస్వామి, గాయక్వాడ్, వస్త్రాకర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
స్మృతి మందానా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.