యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ హోలీ పండుగ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రాజకీయంగా ముఖ్యమైన ఎన్నికల విజయం తర్వాత పార్టీ శ్రేణులకు విస్తృత సందేశాన్ని పంపడానికి తగిన విధంగా పార్టీలో మార్పులు జరగనున్నాయని తెలుస్తుంది. పార్టీ కోసం పని చేసిన వారికి పట్టం కట్టే అవకాశం ఉందని, పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం రేపు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యోగి భేటీ కానున్నారు. మంత్రివర్గంలో ఈ దఫా అన్ని ప్రాంతాలు, కులాల వారిగా ప్రాధాన్యత కల్పించే దిశగా నేతలు సమాలోచనలు చేయనున్నారు.
మరోవైపు యోగి ఆదిత్యనాథ్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని శపథం చేశాడు షాజహాన్ పూర్ నివాసి రాజారామ్. సదర్ బజార్ ప్రాంతంలో నివాసం ఉండే మొహల్లా ఝండా కలాన్‌కు చెందిన రాజారామ్.. గతంలొ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయిన తర్వాత గడ్డం, తల వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని చెప్పాడు. కటిక పేద కుటుంబానికి చెందిన రాజారాం ..చెప్పులు కుట్టే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య చనిపోయింది. ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, కనీసం ఇప్పుడైనా తనను గుర్తించి.. తనకు సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు.