కరోనా మూడో దశపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. తప్పనిసరిగా థర్డ్ వేవ్ వస్తుందని, చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా నిర్ధిష్టమైన ఆధారాలు లేవని వెల్లడించారు.
రాబోయే కాలంలో కరోనా చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఇటీవల వస్తున్న వార్తలు చిన్నారుల తల్లిదండ్రులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పిడియాట్రిక్ టాస్క్ ఫోర్సు లు కూడా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో గులేరియా చేసిన ప్రకటన ప్రాధాన్యం సతరించుకుంది.
మొదటి, రెండో దశల్లో కూడా కరోనా పిల్లలపై కొద్దిపాటి ప్రభావం చూపిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే పిల్లల్లో కనిపించాయని పేర్కొన్నారు. దీంతో మూడో దశ ఒకవేళ ఎదురైతే అది ప్రత్యేకంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుందని చెప్పడానికి శాస్త్రీయమైన కారణాలు లేవని గులేరియా వివరించారు.
రెండో దశలో కోవిడ్ కు గురై ఆస్పత్రుల్లో చేరిన చిన్నారుల్లో 70 శాతం మంది ఇతరత్రా వ్యాధులు కలిగి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారున్నారని, స్వల్ప లక్షణాలు వచ్చిన వారు ఆస్పత్రిలో చేరకుండానే కోవిడ్ నుంచి బైట పడ్డారని గులేరియా పేర్కొన్నారు. లాక్ డౌన్ లతో కోవిడ్ నియంత్రణలోకి వచ్చిందని, అయితే ఒక్కసారిగా అన్ లాక్ చేస్తే ఇబ్బందులు ఎదురుకావోచ్చని అభిప్రాయపడ్డారు.