Be Careful: ఎదురుగా జనాలు ఉన్నారు గదా అని చెప్పి పూనకం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు హితవు పలికారు. పవన్ రీల్ హీరో అని, కానీ తాను రియల్ హీరోనని వ్యాఖ్యానించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని తనపై వ్యాఖ్యానించే హక్కు పవన్ కు లేదన్నారు. మానసిక అత్యాచారం అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యల సంగతేమిటని ప్రశ్నించారు. సోషల్ మీడియా సైనికులు తమపై చేసిన విమర్శలకు, తిట్టే బూతులకు తమ కుటుంబ సభ్యులు కూడా బాధపదతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ఆవేశం, పౌరుషం ఒక్క పవన్ కే కాదని తమకూ ఉన్నాయని అవంతి ఎదురుదాడి చేశారు. తాను దేవుణ్ణి నమ్ముతానని, ఎవరి జోలికీ వెళ్ళేవాడిని కాదని, కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బంతి ఎంత గట్టిగా లేస్తుందో చూడాలని, అంత చులకనగా హేళన చేయాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కంటే తాను లక్ష రెట్లు ధైర్యవంతుడినన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ అనేవాడు ఎక్కడుండేవాడని, అయన గురించి ప్రస్తావించే సంస్కారం లేదంటే ఎమనుకోవాలని, చిరంజీవి లేకపోతె నువ్వు ఎవరికైనా తెలుసా అని పవన్ ను ప్రశ్నించారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం పవన్ కు సరదాగా ఉందని, కానీ తమకు ఆ సరదా లేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి, గుండాగిరి పవన్ కు కనిపించలేదా అని అవంతి సూటిగా నిలదీశారు. పవన్ మాట్లాడేవన్నీ ఎవరో రాసిచ్చిన డైలాలేనన్నారు.
ఇవి కూడా చదవండి: వ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్