కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మండిపడ్డారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 171 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వరు. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 200 కోట్లు కేటాయించారు. ఒక వేళ మనకు ఒక కాలేజీని కేటాయించినా బాగుండేది కదా అన్నారు. నవోదయ విద్యాలయాల కేటాయింపుల్లోనూ కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పిల్లలు ఏం చదువుకోవద్దా? అని నిలదీశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంపదలో వాటా రావాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ, ఐఐఎంలు మనకు ఎందుకు ఇవ్వరు? ఎయిమ్స్ కు నిధులు ఇవ్వరు? ఐటీఐఆర్‌ను ఇవ్వలేదు, నిమ్జ్ వంటి ప్రాజెక్టులకు నిధుల్లేవు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణం. ఈ దేశంలో సృష్టించబడుతున్న సంపద తెలంగాణ రాష్ట్రానికి కూడా రావాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం కేంద్రానికి తగదన్నారు. ఈ దేశ సంపదను బీజేపీ అమ్మేస్తోందని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ఉర్దూ స్టడీ సెంటర్ కోసం ఎంఐఎం డిమాండ్