Imrankhan : పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అవిశ్వాస గండం పట్టుకుంది. ఇటీవలి వరకు తమ ప్రభుత్వానికి డోకా లేదని నిబ్బరంగా ఉన్న ఇమ్రాన్ కు రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆయన ప్రభుత్వానికి పలువురు సంకీర్ణ కూటమి ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉండగలరా? అనే దానిపై మరింత అనిశ్చితి ఏర్పడింది.
గురువారం ముగ్గురు మంత్రులు, 24 మంది ఎంపీలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ రోజు(శుక్రవారం) వారంతా ఇస్లామాబాద్ లోని సింద్ హౌస్ లో ఆశ్రయం పొందారు. సింద్ రాష్ట్రంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వ నిర్వహణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తున్నది. ప్రధానంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానాన్ని సరిగా నిర్వహించలేదని ప్రతిపక్షం విమర్శలను గుప్పించింది.
ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానమంత్రితో తమకు విభేదాలు ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీలోని ఎంపీ రాజా రియాజ్ అంతర్జాతీయ మీడియాకు ఇప్పటికే తెలిపారు. 20 మందికి పైగా ఫిరాయింపుదారులు ఉన్నారని, మనస్సాక్షి ప్రకారం ఓటేస్తామని ఆయన అన్నారు. ఇస్లామాబాద్‌లోని ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కార్యాలయంలో పలువురు అధికార పార్టీ సభ్యుల రికార్డ్ చేసిన ఫుటేజీ మీడియాలో వస్తోంది.
ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడాలంటే.. 172 మంది ఎంపీల మద్దతు అవసరం. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు కాగా మిత్రపక్ష పార్టీలు, అధికార పార్టీ Pakistan Tehreek E Insaaf(PTI)లోని అసమ్మతి వాదులు మినహా ఇమ్రాన్‌ఖాన్‌కు దిగువసభలో 155 సభ్యుల మద్దతు ఉంది. ఇతర పక్షాలతో కలిసి ఇప్పటివరకు 172 మంది సభ్యుల మద్దతు ఇమ్రాన్ ప్రభుత్వానికి ఉండేది. నవాజ్‌షరీఫ్ సారధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ -నవాజ్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) లకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వచ్చందంగా రాజీనామా చేయటం ఒక్కటే మార్గమని విపక్షాలు హెచ్చరించాయి. మరోవైపు ఈ నెల 24వ తేదిన ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (OIC) సమావేశం ఉంది. ఇస్లామాబాద్ లో జరిగే ఓఐసి విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని ఇమ్రాన్ ప్రభుత్వం ప్రణాలికలు సిద్దం చేసింది. తాజాగా ఇస్లామాబాద్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి: ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు