Crop Colonies : దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం మహారాష్ట్రలో పర్యటిస్తోంది. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు మహారాష్ట్ర వెళ్ళిన బృందంలో ఉన్నారు. పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా శిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలు పరిశీలించి స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమైన బృందం షిరిడీ ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్ పై రైతులతో ముచ్చటించింది.
దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాలని, రైతుకు న్యాయం జరిగేలా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తున్నదని ఆరోపించారు. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లాలని, యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలని మంత్రి కోరారు. తెలంగాణలో పంటల వైవిద్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషిచేస్తున్నమన్న మంత్రి పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటల పరిశీలనకు వచ్చామని, తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.