హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో హోలీ వేడుకలు ఈ ఏడాది ప్రత్యేకతను సంతరించుకున్నాయి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా చాల రోజుల తర్వాత శుక్రవారం హోలీ సందర్భంగా ప్రజలకు దర్శనం ఇచ్చారు. ధర్మశాలలోని టిబెటన్ల ప్రధాన ఆలయం సుగ్లాక్తాంగ్ లో భోదిచిత్త జానపద కథలు చెప్పారు. వయసు రిత్యా, కరోనా నేపథ్యంలో తరచుగా ఢిల్లీ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాని, తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. ప్రపంచ శాంతి కోసం అందరు కృషి చేయాలని సూచించారు. హోలీ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దలైలామాకు శుభాకాంక్షలు తెలిపారు.
రెండేళ్ళ విరామం తర్వాత 14వ దలైలామా దర్శనంతో టిబెటన్లు, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో ధర్మశాలలోనే ఉండిపోయిన దలైలామా రెండు సంవత్సరాల నుంచి బాహ్య ప్రపంచంలోకి రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే అనుమానం కూడా ప్రజల్లో మొదలైంది. రోమానియా, జర్మనీ, అమెరికా, కెనడా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో దలైలామా దర్శనం కోసం వచ్చారు.