రైతాంగానికి శుభవార్త. ప్రపంచంలోనే మొదటిసారిగా ద్రవ రూపంలో యూరియాను భారత్ తయారు చేసింది. నీటి రూపంలో ఉన్న ఈ నానో యూరియా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. భారత ప్రభుత్వ సహకారంతో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజెర్స్ కో అపరేటివ్ లిమిటెడ్(IFFCO) ఇఫ్ఫ్కో సంస్థ రూపొందించిన నానో యూరియా జమ్ముకశ్మీర్ రైతాంగానికి మొదటగా అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్ లో లాంచనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో 70 శాతం ప్రజలకు వ్యవసాయ రంగమే జీవనాధారమని, కొండ ప్రాంతాల్లో సాగు చేసే హిమాలయ రైతులకు యూరియా బస్తాలు మోసే ఇబ్బందులు నానో యూరియా తో తీరాయని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. బాస్మతి వరి కశ్మీర్ లో అధికంగా సాగు అవుతుందని, రైతులకు నానో యూరియా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
గుజరాత్ లోని కలోల్ ప్రాంతంలోని ఇఫ్ఫ్కో ప్లాంటు లో నానో యూరియా ఉత్పత్తి జరుగుతోంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రం కోసం 15 వేల బాటిళ్ళ నానో యూరియా కలోల్ నుంచి ఇప్పటికే పంపించారు. చీడ పీడల నుంచి పంటలను రక్షించి అధిక దిగుబడికి ఈ యూరియా తోడ్పడుతుందని ఇఫ్ఫ్కో ఎండి యు.ఎస్. అవస్థీ వెల్లడించారు. 15 వేల ద్రవ రూప యూరియా 675 మెట్రిక్ టన్నుల సాధారణ యూరియాకు సమానమని అవస్థీ వివరించారు.
ఒక బాటిల్ ధర 240 రూపాయలు. సాధారణ యూరియా బస్తా కన్న పది శాతం తక్కువ రేటుకే నానో బాటిల్ లభిస్తోంది. భూసారాన్ని కాపాడి పంట దిగుబడి పెంచేందుకు ఈ యూరియా మేలు రకమైనదని ఇఫ్ఫ్కో వర్గాలు చెపుతున్నాయి. వాణిజ్యపరంగా నానో యూరియా మార్కెట్లో అన్ని వర్గాలకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.