FIH Pro-league: 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా అర్జెంటీనాతో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఇండియా 4-3 తేడాతో విజయం సాధించి నిన్నటి షూటౌట్ కు బదులు తీర్చుకుంది. ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ తొలి పావు భాగంలో రెండు జట్లూ గోల్ చేయలేదు.
17వ నిమిషంలో హార్దిక్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఇండియాకు తొలి గోల్ అందింఛి స్కోరు బోణీ చేశాడు, 20వ నిమిషంలో జగ్ రాజ్ సింగ్ పెనాల్టీ కార్నర్ గోల్ చేసి తొలి అర్ధ భాగానికి ఇండియాకు 2-0 ఆధిక్యం సంపాదించాడు, తర్వాత అర్జెంటీనా 40, 51 నిమిషాల్లో పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ చేసి స్కోరు సమం చేసింది.
ఈ దశలో 52వ నిమిశంలో జగ్ రాజ్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ సంపాదించాడు, 56వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఫీల్డ్ గోల్ చేయడంతో మళ్ళీ స్కోరు సమం అయ్యింది. ఆట చివరి నిమిషంలో ఇండియా ఆటగాడు మన్ దీప్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి ఇండియా కు 4-3తో విజయాన్ని అందించాడు.
పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది, ఇప్పటికి ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఇండియా ఐదు విజయాలు సొంతం చేసుకోగా, రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది.
ఇండియా తన తరువాతి మ్యాచ్ లు ఇంగ్లాండ్ తో ఇదే స్టేడియంలో ఏప్రిల్ 2,3 తేదీల్లో ఆడనుంది.