Never Before: గతంలో స్పీకర్ స్థానం చూట్టూ నిల్చుని, ఆయన్ను అవమానపరిచిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. జంగారెడ్డి గూడెంలో ఇంత మంది కల్తీ సారాకు బలైపోతే, ఈ అంశంపై చర్చకు కనీసం అనుమతివ్వకపోవడం దారుణమన్నారు. తాను 30 ఏళ్ళపాటు ప్రజా జీవితంలో ఉన్నానని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశానని కానీ మార్షల్స్ ను అడ్డుపెట్టుకొని సభ నడిచిన దాఖలాలు ఎప్పుడూ లేవన్నారు. సభ నుంచి సభ్యుడిని సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే మార్షల్స్ వస్తారని కాని, సభ జరుగుతున్నప్పుడు కూడా సభలో వారు ఉండడం తాను గతంలో ఎప్పుడూ చూడలేదని, ఈ ప్రభుత్వం హయాంలోనే చూస్తున్నానని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెవుల్లో సీసం పోసుకున్నారని, ప్రజల ఆర్తనాదాలు వారికి వినబడడం లేదని, వాళ్ళ కంటికి డబ్బులు తప్ప మరేమీ కనబడడం లేదని, వారికి తమ బాధ తెలియజెప్పాలనే ఉద్దేశంతో, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తాను సభలో విజిల్ వేశానని గద్దె వివరణ ఇచ్చారు. ఇది కౌరవ సభ అని, దీని అంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు.