TDP protest: జంగారెడ్డి గూడెం మరణాలపై నేడు కూడా తెలుగుదేశం సభ్యులు శాసన సభ, మండలిలో ఆందోళనలు కొనసాగించారు. మండలిలో టిడిపి సభ్యులు మంగళ సూత్రాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తో పాటు అధికార పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంగళ సూత్రాలు ప్రదర్శించి మహిళలను అవమానపరుస్తున్నారని, ఇది సరికాదని అభ్యంతరం తెలిపారు.
హిందూ ధర్మంలో మంగళ సూత్రాలకు ఎంతోపవిత్రత ఉందని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా టిడిపి సభ్యుల ప్రవర్తన ఉందని, మహిళలను అవమాన పరుస్తున్నారని ఛైర్మన్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సభ్యులను సస్పెండ్ చేసేందుకు తీర్మానం ప్రతిపాదించాలని సూచించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను కాసేపు వాయిదా వేశారు.
అనంతరం టిడిపి సభ్యులు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్ బాబు, దీపక్ రెడ్డి, కేఈ ప్రభాకర్, బిఎన్ రాజ సింహులు, దువ్వరపు రామారావు, బి. తిరుమల్ నాయుడు , మంతెన వెంకట సత్యనారాయణ రాజు లను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.
Also Read : నిన్న అసెంబ్లీలో… నేడు కౌన్సిల్ లో