దేశంలో ఆహార ధాన్యాలు ముఖ్యంగా పప్పులు, వంటనూనెల ధరలు స్థిరీకరించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆహార శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీపీఎఫ్‌ఐ) ఆధారంగా ఆహార ధాన్యాల ధరల్లో హెచ్చు తగ్గులను ప్రభుత్వం మదింపు చేస్తుంటుందని చెప్పారు. ఆహార ధాన్యాలు, ఉద్యానవన ఉత్పాదనల ధరల హెచ్చు తగ్గులకు అనేక కారణాలు ఉంటాయి. డిమాండ్-సప్లైలో వ్యత్యాసం, సీజన్, సప్లై చైన్‌లో ఏర్పడే అవరోధాలు, బ్లాక్ మార్కెటీర్లు సృష్టించే కృత్రిమ కొరత, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల వంటి వివిధ అంశాలు ఆహార ధాన్యాల ధరలను ప్రభావితం చేస్తుంటాయని మంత్రి చెప్పారు.
రిటైల్ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరల తీరు ఆధారంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక చర్యలు తీసుకుంటుంది. నిత్యావసర ఆహార ధాన్యాల ధరలను స్థిరీకరించేందుకు స్టాక్ పరిమితులు విధించడం, వివిధ సంస్థలు ప్రకటించే ఆహార ధాన్యాల స్టాక్‌ను పర్యవేక్షించడం, ఆహార ధాన్యాల దిగుమతులపై సుంకాలను తగ్గించడం, ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలతో ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలు పెరుగుదలకు కళ్ళెం వేస్తుంటుందని తెలిపారు.
మిల్లర్లు, దిగుమతిదార్లు, ట్రేడర్లు తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను బహిర్గతం చేయాల్సిందిగా గత ఏడాది మేలో రాష్ట్రాలకు సూచలు పంపించాం. మినప పప్పు, కంది పప్పు, శెనగపప్పు, మసూర్ పప్పు ధాన్యాల నిల్వలపై గత ఏడాది అక్టోబర్ 31 వరకు పరిమితులు విధించాం. రిటైల్ మార్కెట్లో వినియోగదారులకు ఈ పప్పు ధాన్యాల లభ్యతను పెంచుతూ ధరల స్థిరీకరణ కోసం ఫ్రీ కేటగిరీ కింద వాటిని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఉల్లి ధరల నియంత్రణ కోసం బఫర్ స్టాక్‌ను 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. ఉల్లి ధరల్లో పెరుగదల కనిపించినప్పుడల్లా ఆయా రాష్ట్రాలకు బఫర్ స్టాక్ నుంచి ఉల్లి నిల్వలను విడుదల చేస్తున్నాం అని మంత్రి వివరించారు.
వంట నూనెల లభ్యతను పెంచి వాటి ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై డ్యూటీలను గణనీయంగా తగ్గించడం జరిగింది. శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కూడా డ్యూటీలను ప్రభుత్వం తగ్గించినట్లు మంత్రి తెలిపారు. హోర్డింగ్ జరగకుండా నివారించేందుకు వంట నూనెలు, నూనె గింజల నిల్వల పరిమితులపై ఈ ఏడాది జూన్ 30 వరకు పరిమితులు విధించినట్లు ఆయన చెప్పారు.
Also Read : చైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ