England into Semis: ఐసిసి మహిళా వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ సెమీఫైనల్లో ప్రవేశించింది. టోర్నీ మొదట్లో పేలవమైన ఆట తీరు ప్రదర్శించిన ఇంగ్లాండ్ మహిళలు ఆ తర్వాత తమ ఆట తీరుకు పదును పెట్టి వరుస విజయాలతో సత్తా చాటారు. సెమీస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఇంగ్లాండ్ 100 పరుగులతో ఘన విజయం సాధించింది.
వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సోఫియా డంక్లీ-67; స్కైవర్-40; బ్యూమౌంట్-33; అమీ జోన్స్-31 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సల్మా ఖాతున్ రెండు; జహానర అలామ్, రితు మోనీ, ఫహిమా ఖాతున్, లతా మొండాల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించింది. తర్వాత మంచి భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది. వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. లతా మొండాల్-30; షమీనా సుల్తానా-23; షమీన్ అక్తర్-23, నైగర్ సుల్తానా-22 మాత్రమే రాణించారు. 48 ఓవర్లలో 134 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్, డీన్ చెరో మూడు; ఫ్రేయా డేవిస్ రెండు, హైదర్ నైట్ ఒక వికెట్ పడగొట్టారు.
67 పరుగులతో రాణించిన సోఫియా డంక్లీ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.