India lost: ఐసిసి మహిళా వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా కథ ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. లారా వోల్వార్ద్ట్-80 మిగ్నాన్ డు ప్రీజ్-52 నాటౌట్; లారా గూడాల్- 49 పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా చివరి ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.
దీప్తి శర్మ వేసిన చివరి ఓవర్లో విజయానికి రెండు బంతుల్లో నాలుగు పరుగులు కావాల్సిన దశలో హర్మన్ ప్రీత్ క్యాచ్ పట్టడంతో డూప్రేజ్ ఔటయ్యింది. ఈ దశలో ఇండియా విజయావకాశాలపై ఆశలు రేగాయి, కనీసం సూపర్ ఓవర్ అయినా అవుతుందని అంతా అకున్నారు. కానీ ఆ బంతిని అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా ఇండియా శిబిరంలో నిరాశ ఆవరించింది. రెండు బంతుల్లో రెండు పరుగులు కావాల్సి ఉండగా సౌతాఫ్రికా బ్యాట్స్ విమెన్ రెండు పరుగులు చేసి అద్భుత విజయం నమోదు చేసుకున్నారు. దీనితో ఇండియా మ్యాచ్ ను తృటిలో చేజార్చుకుని సెమీస్ కు చేరకుండానే లీగ్ దశనుంచే నిష్క్రమించింది.
క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మందానా-71; కెప్టెన్ మిథాలీ రాజ్-68; షఫాలీ వర్మ-53; హర్మన్ ప్రీత్ కౌర్-48 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 274 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు; ఖాక, టైరన్ చెరో వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికా 14 పరుగులకే తొలి వికెట్ (లిజేల్లీ లీ- 6 రనౌట్) కోల్పోయినప్పటికీ రెండో వికెట్ కు వోల్వార్ద్ట్, గూడాల్ 125 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి గట్టి పునాదులు వేశారు. ఇండియా బౌలర్లలో గయక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ముగ్గురు సౌతాఫ్రికా బాట్స్ విమెన్ రనౌట్ అయ్యారు.
ఇండియా ఓటమితో వెస్టిండీస్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది.
మిగ్నాన్ డూ ప్రెజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.