Babu to Reconstruct: ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాము ఎల్లప్పుడూ ప్రజాహితం కోసమే పని చేశామని, మళ్ళీ అధికారంలోకి రావాలని ఎప్పుడూ పనిచేయలేదని, అలా చేసి ఉంటే ఎప్పుడూ అధికారంలోనే ఉండే వాళ్ళమని అన్నారు. టిడిపి సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీతో తన 40 ఏళ్ళ అనుబంధాన్ని, అనుభవాలను “నేను-తెలుగుదేశం” పేరిట గ్రంథస్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
గతంలో తాను ఐటి, ఇతర సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు తనను విమర్శించినవారు ఇప్పుడు వాటిని పొగుడుతున్నారని, తాను దూరదృష్టితోనే ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, ఎప్పుడూ భవిష్యత్ తరాల కోసమే ఆలోచన చేశామని బాబు వెల్లడించారు. ప్రజల మేలు కోసం మేము పని చేస్తామన్నారు. రాజకీయాల్లో వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నాడు ఎన్టీఆర్ కు తాను సూచించానని గుర్తు చేసుకున్నారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయలవైపు వచ్చారన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి రిసిందని, ఆ పథకం జాతికే ఆదర్శం అయ్యిందని చెప్పారు. పార్లమెంటులో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉందన్నారు.
ఇన్నేళ్ళలో తాను చేసిన అభివృద్ధి ఎంతో ఆత్మ సంతృప్తి ఇస్తుందని, ఐటి గురించి తాను అప్పుడే చెప్పానని, వైఎస్ లాంటి వాళ్ళు విమర్శించారని చంద్రబాబు అన్నారు. నాడు తాను ఏర్పాటు చేసిన ఐటి కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసినవారు ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్నారని, ఇది తనకు గర్వకారణమని, పేద పిల్లల్ని ఐటి ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దింది టీడీపీయేనని బాబు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతీ ఒక్కరికి ఇల్లు గడిచే విధంగా ఒక వ్యాపారమో, వ్యవసాయమో ఉంటే బాగుంటుందని తాను ఎప్పుడూ నాయకులకు చెబుతున్తానని, రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుందని బాబు అన్నారు. టిడిపి ఆవిర్భావ వేడుకలను రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుపుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమన రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, మురళీ మోహన్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ మంత్రి, టిఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు, దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్వనీ దత్, పయ్యావుల కేశవ్, సిపిఐ నేత నారాయణ, సీనియర్ పాత్రికేయులు కే. రామచంద్ర మూర్తి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : రేపు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం