Friday, October 18, 2024
HomeTrending Newsరాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు

రాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు

జనజీవితంలో సుదీర్ఘ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న నేతలంతా దేశ హితం కోసం దానిని నలుదిశలా వ్యాపింపజేయాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి సూచించారు. రిటైరైన ఎంపీలందరూ తిరిగి రాజ్యసభలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న వివిధ పార్టీలకు చెందిన 72మంది ఎంపీలకు వీడ్కోలు పలుకుతూ గురువారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కీలక ప్రసంగం చేశారు.

రాజ్యసభలో పదవీ కాలం పూర్తయిన 72మంది సభ్యులకు ఇవాళ పార్లమెంటులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకోసం రాజ్యసభ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేశారు. రాజ్యసభను వీడుతోన్న ఎంపీలు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. 72 మంది ఎంపీలతో ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ సభాపక్షనేత మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను మోదీ ఆప్యాయంగా పలకరించారు.

పదవీకాలం పూర్తికానున్న వారిలో ఏకే ఆంటోని, అంబికా సోని, పీ చిదంబరం, ఆనంద్ శర్మ, సురేశ్ ప్రభు, ప్రఫుల్​ పటేల్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రసన్న ఆచార్య, సంజయ్​ రౌత్​, నరేశ్ గుర్జాల్​, సతీష్ చంద్ర మిశ్ర, ఎంసీ మేరీ కోమ్, స్వపన్ దాస్ గుప్తా, నరేంద్ర జాధవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తెలుగురాష్ట్రాల నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభు, విజయసాయిరెడ్డి, డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉన్నారు.

చట్టసభ్యులందరూ అంకితభావం, మెరుగైన పనితీరు, విధానపరమైన సమగ్రతతో నడుచుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. చట్టాలను రూపొందించే సంస్థలకు విఘాతం కలగించకుండా ఉండాలన్నారు. సభ్యుల ఆందోళన కారణంగా 2017 నుంచి 35శాతం సభా సమయం వృథా అయిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఆరు రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 13 రాజ్యసభ ఎంపీలు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. వారి స్థానాలను భర్తీ చేయడానికి ఈ నెల 31వ తేదీన ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Also Read : పప్పులు, నూనెల ధరల స్థిరీకరణకు చర్యలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్