Thalli Bidda: అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు తమ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ అడుగులు వేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. చెల్లెమ్మలు గర్భం దాల్చిన సమయం నుంచీ ప్రసవం అయిన తరువాత కొన్ని నెలల వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో అత్యాధునికంగా రూపొందించిన 500 తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ ఏసీ అంబులెన్సు లను సిఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలతో పాటు డబ్ల్యూ హెచ్ వో-జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులను కూడా అందిస్తున్నామన్నారు. ప్రసవం అయిన తరువాత విశ్రాంతి సమయంలో సిజేరియన్ అయితే మూడు వేలు, నార్మన్ డెలివరీ అయితే ఐదు వేల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద అందించి తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ లో ఇంటివద్ద దించుతున్నామని వివరించారు.
గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో మనమంతా చూశామని, అరకొరగా ఉండే వాహనాలు, అదీ ఒక్కొక్కసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండేదని జగన్ గుర్తు చేశారు. ఉన్నవాటిలో కూడా వసతులు సరిగా లేని పరిస్థితుల నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితుల్లోకి ఈ ఈ వాహనాల వ్యవస్థను తీసుకువస్తున్నామన్నారు.
104, 108 వాహనాల ఆధునీకరణతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నాడు–నేడు పనులతో మెరుగుపరిచామని, ఆస్పత్రుల రూపురేఖలు మార్చుతున్నామని సిఎం వివరించారు. అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతకు ముందు వాహనాలను, లోపల అమర్చిన వివిధ పరికరాలను సిఎం జగన్ స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(వైద్యఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్(నాని), పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సివిల్ సఫ్లైస్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పలువురు ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.