పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి మే 2వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించింది. దీనికి ప్రతీకగా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.